స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాల్ని విచారణ నిమిత్తం తగు నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరికి నివేదించాలని రిజిస్ట్రీని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటీవల దాఖలు చేసిన అదనపు కౌంటర్ అఫిడవిట్‌ను ఫైళ్లతో జతచేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్,జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ.. న్యాయవాది తాండవ యోగేష్, ఏవీ గోపాలకృష్ణ మూర్తి.. గతేడాది హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం కోరుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తాజా విచారణలో నవంబర్ 4న అదనపు వివరాలతో కౌంటర్ అఫిడవిట్ వేశామని.. ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. కరోనా కారణంగా ఎన్నికల్ని వాయిదా వేశామని, ఆ నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎస్ఈసీ నిర్ణయాన్ని సమర్థించిందన్నారు. గతంలో ఈ వ్యాజ్యాలను సీజే బెంచ్ విచారణ జరిపినందున.. అక్కడికే పంపుతామని తెలిపిన ధర్మాసనం.. ఆ మేరకు ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి
'సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు'