కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన 4 సంస్కరణల అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం అదనపు ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రధానమైన నాలుగు సంస్కరణల్లో మూడు సంస్కరణలు అమలు చేసిన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాష్ట్రాలకు.... మూలధన వ్యయం కోసం ప్రత్యేక సహాయంగా రూ.1004 కోట్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు అదనపు సాయం కింద 10వేల 250 కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్రం.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.344 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.660 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.
అగ్ర భాగంలో ఏపీ, మధ్యప్రదేశ్...
రాష్ట్రాలు వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే అప్పులకు సంబంధం లేకుండానే ఈ అదనపు సాయం ఇస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే కేటాయించిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.172 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.330 కోట్లు తొలి విడత కింద నిధులు విడుదల చేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించినా.. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత సంస్కరణలైన... ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు, సులభతర వాణిజ్యం, పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ముందు భాగాన ఉన్నాయని వెల్లడించింది.
తెలంగాణకు రూ.179 కోట్లు...
ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా రాష్ట్రాల్లో అనేక సంస్కరణల తీసుకువచ్చే పథకానికి గత ఏడాది అక్టోబర్ 12న కేంద్రం శ్రీకారం చుట్టుంది. అప్పటినుంచి రాష్ట్రాలు అమలు చేసే విధానానికి అనుగుణంగా దశల వారీగా అదనపు నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ పథకంలో భాగంగా తెలంగాణకు రూ.179 కోట్లు ప్రకటించి రూ.89.50 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటన వెల్లడించింది. తమిళనాడు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు తొలి దఫా నిధులు విడుదల అయినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి