Lowest quoted deal: ఓ జాతీయ రహదారి విస్తరణకు పిలిచిన టెండరులో అంచనా వ్యయం కంటే 35.45% లెస్‌కు కోట్‌చేసి ఓ సంస్థ ఎల్-1గా నిలవడం రికార్డు సృష్టించింది. గడిచిన కొన్నేళ్లలో ఇంత తక్కువకు వెళ్లిన టెండర్లు ఏవీ లేవని గుత్తేదారు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉరవకొండ నుంచి అనంతపురం, కదిరి, మదనపల్లి మీదుగా తమిళనాడులోని కృష్ణగిరికి వెళ్లే జాతీయరహదారి-42లో.. అనంతపురం జిల్లా పరిధిలో బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ వరకు 33 కి.మీ. రహదారి నాలుగు వరుసలుగా విస్తరణ, బత్తలపల్లి వద్ద బైపాస్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి రూ.418.27 కోట్ల అంచనా వ్యయంతో రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) అధికారులు టెండర్లు పిలిచారు. బిడ్లు వేసిన గుత్తేదారు సంస్థల్లో 14 అర్హత సాధించాయి. వీటి ఆర్థిక బిడ్లు శుక్రవారం తెరిచారు. ఇందులో తమిళనాడుకు చెందిన ఎస్‌డీ ఇన్‌ఫ్రా అంచనా కంటే 35.45% తక్కువగా (లెస్‌కు) రూ.270 కోట్లకు కోట్‌చేసి ఎల్-1గా నిలిచింది. అంటే ఈ సంస్థ అంచనా కంటే రూ.148.27 కోట్లు తగ్గించుకొని, ఈ పని చేయనుంది. ఈ టెండర్లలో నాలుగు సంస్థలు 30 శాతానికిపైగా లెస్‌కు కోట్ చేశాయి.
మంతనాలు ఫలించలేదు
ఈ రహదారి విస్తరణ పని దక్కించుకునేందుకు కొందరు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ సంస్థ నేతల ద్వారా మంతనాలు జరిపింది. ఇతర సంస్థలను బిడ్లు వేయకూడదని కోరారు. అయితే కొందరు బిడ్‌లో పాల్గొంటామని తెగేసి చెప్పడంతో.. తప్పనిసరి పోటీ ఏర్పడింది.
ఇంత తక్కువ.. ఇదే రికార్డు
రహదారి టెండరు అంచనా కంటే 35.45% లెస్‌కు ఖరారు కావడం.. జాతీయరహదారి పనుల్లో రికార్డు అని గుత్తేదారులు చెబుతున్నారు. కొంతకాలం కిందట కావలి-దుత్తలూరు మధ్య ఎన్‌హెచ్ టెండరులో ఓ సంస్థ 32% లెస్‌కు పని దక్కించుకుంది. ఇప్పటివరకు అదే రికార్డు కాగా.. తాజా టెండరు కొత్త రికార్డు సృష్టించిందని అంటున్నారు.