అమరావతి రైతుల మహా పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. గుంటూరు నగరంలో అడుగడుగునా జనం హారతులు పట్టి, పూలబాట పరిచారు. రాజకీయ పక్షాలతోపాటు మహిళలు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు అన్నదాతలతో కలిసి నడిచారు. మూడోరోజు బుధవారం గుంటూరులోని బండ్లమూడి గార్డెన్‌లో ఉదయం 8.30 గంటలకు మొదలైన పాదయాత్ర 13.5 కి.మీ.పైగా సాగి సాయంత్రం ఆరు గంటలకు పుల్లడిగుంటకు చేరుకుంది. అమరావతి రోడ్డు, లాడ్జిసెంటర్, అరండల్‌పేట, డొంకరోడ్డు, మూడు వంతెనలు, కొత్తపేట, హిమనిసెంటర్, పాతబస్టాండు సెంటర్, లాలాపేట, పట్నంబజారు మీదుగా నల్లచెరువు వరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు మేమున్నామంటూ ఎదురేగి హారతులు ఇచ్చారు. బొల్లావులను తలపై పెట్టుకుని నృత్యాలు చేశారు. జనం ఇళ్లలో నుంచి బయటికి వచ్చి పాదయాత్రను తిలకించారు. శ్రీవారి నమూనా ఆలయంతో ఉన్న వాహనం ఎదుట మహిళలు పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తూర్పు నియోజకవర్గంలోకి ప్రవేశించే మార్గంలో పెద్దఎత్తున బ్యానర్లు కట్టారు. కొత్తపేటలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. లాలాపేట మసీదు వద్ద పాదయాత్ర ముందు ముస్లింలు ప్రార్థనలు చేశారు. పాదయాత్రికులు రహదారి పొడవునా... అమరావతి రైతుల ఆవేదన, రాజధాని మార్చితే రాష్ట్రానికి జరిగే అన్యాయాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. మూడు వంతెనల వద్ద తెదేపా జెండాలను పట్టుకోవద్దంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో తెదేపా నేతలు అమరావతి ఐకాస జెండాలను పట్టుకున్నారు. విద్యానగర్‌కు చెందిన రైతు చంద్రమౌళిరెడ్డి ఆవు, లేగదూడ తీసుకువచ్చి పాదయాత్రతోపాటు నడిచారు.
నంది, గుర్రం బొమ్మలతో కళాకారుల నృత్యం
కర్షకులకు పూలబాట
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు సాగుతున్న పాదయాత్ర పొడవునా... నగరం, పల్లె తేడా లేకుండా స్థానికులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి పూలు చల్లుతూ అభిమానం చాటుకున్నారు. నల్లచెరువులో మధ్యాహ్న భోజనం తర్వాత యాత్ర ప్రారంభించి ఏటుకూరు మీదుగా పుల్లడిగుంట చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. ఏటుకూరు బైపాస్ వంతెన వద్ద, గ్రామంలోనూ జనసేన కార్యకర్తలు రైతులపై పూలుచల్లి ఆత్మీయ స్వాగతం పలికారు. యాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించగానే వింజనంపాడు, పుల్లడిగుంట ప్రజలు పూలవర్షం కురిపించారు.
కలసి నడిచిన నేతలు
గుంటూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసయాదవ్ ట్రాక్టరు నడిపి రైతులకు సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, మాజీ మంత్రి నక్కాఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, నాయకులు మన్నవ మోహనకృష్ణ, కోవెలమూడి రవీంద్ర(నాని), నసీర్ అహ్మద్, మల్లెల రాజశేఖర్, మన్నెం శివనాగమల్లేశ్వరరావు, శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్‌బాబు తదితరులు రైతులతో కలసి నడిచారు. ఏఐటీయూసీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో కార్మికులు బ్యానరుతో వచ్చి మద్దతు తెలిపారు. పాదయాత్ర సాగుతున్న మార్గంలో విద్యార్థులు వచ్చి జైఅమరావతి అంటూ నినాదాలు చేశారు. పాఠశాలల పనివేళల్లో విద్యార్థులు బయటికి ఎలా వచ్చారని, ఏఏ పాఠశాలల పిల్లలు పాల్గొన్నారంటూ విద్యాశాఖవర్గాలు ఆరా తీయడం చర్చనీయాంశమైంది. యాత్ర పొడవునా పోలీసులు సైతం నిఘా ఏర్పాటు చేశారు.
రూ.12 లక్షల విరాళం
అమరావతి పరిరక్షణ సమితి, రైతుల ఐకాసకు బుధవారం రూ.12 లక్షల విరాళాలు వచ్చాయి. తెదేపా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రూ.2లక్షల చెక్కును అందించారు. వేములపల్లి సంక్షేమ సేవాసంఘం వారు రూ.1,01,116, డీఎస్‌ఆర్ మిత్రమండలి సభ్యులు వెంకటేశ్వరావు రూ.50,116 విరాళం అందించారు. స్థానికుడైన ఒక రైతు, హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్యుడు రూ.లక్ష చొప్పున, గుంటూరుకు చెందిన కొమ్మినేని రాజా రూ.20 వేలు ఇచ్చారు. పాదయాత్రికులకు బుధవారం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని తెదేపా నేత కోవెలమూడి రవీంద్ర, రాత్రి భోజనాన్ని వట్టిచెరుకూరు మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పుటూరు సీతామహాలక్ష్మి ఏర్పాటుచేశారు.
ఇదీ చదవండి
Amaravathi: మూడో రోజు కొనసాగుతున్న.. అమరావతి రైతులు మహాపాదయాత్ర