FARMERS PADAYATRA : అమరావతి రైతుల పాదయాత్ర 43వ రోజుకు చేరుకుంది. ఇవాళ రేణిగుంట నుంచి తిరుపతి వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఈ నెల 17న అమరావతి రైతులు బహిరంగ సభ నిర్వహిస్తారు. సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అన్నదాతలు నేడు హైకోర్టును ఆశ్రయించింది.
రేణిగుంట ప్రాంతాల్లో జోరు వర్షం కురుస్తోంది. వర్షంలోనూ రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీఎంపీ కొనకళ్ళ నారాయణ రైతుల పాదయాత్రలో కలిసి నడుస్తున్నారు. వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదని గల్లా జయదేవ్ అన్నారు. స్థానిక సంస్థలకు అధికారాలను బదలాయించి, అన్ని ప్రాంతాల్లోనూ ప్రాజెక్టులు తీసుకువచ్చి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పారు.
తెదేపా అధికారంలో ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. అమరావతిలో కాకుండా ఇతర ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటై, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరుపెట్టి వికేంద్రీకరణ అని మాట్లాడుతున్నారని విమర్శించారు. మచిలీపట్నం ప్రజలు విరాళంగా సేకరించి ఇచ్చిన రూ.12.70లక్షలు కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణలు రాజధాని రైతులకు అందజేశారు.
ఇదీ చదవండి