రాజధానిగా అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్‌సభ, వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ నాయకులు మద్దతు పలికారు. అవకాశం వస్తే అమరావతి ఉద్యమం విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. విజయవాడ వచ్చిన జాతీయ రైతు సంఘాల నాయకులను.. అమరావతి ఐకాస ప్రతినిధులు కలిసి పరిస్థితులను వివరించారు. రాజధాని ఉద్యమ వివరాలను తెలియజేశారు. రైతులతో సీఆర్‌డీఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో హామీలు వేటినీ నెరవేర్చడం లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి: కరోనా యోధులకు కొత్త బీమా పాలసీ!
గత ప్రభుత్వం సమీకరణ పద్ధతిలో భూములు సేకరించిందని.. రాజధాని కోసం తమ పంట భూములను అందజేశామని రైతులు పేర్కొన్నారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట ఈ ప్రాంతంలో అభివృద్ధిని నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళలను పోలీసులతో బలవంతంగా అణగదొక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహిళలపై జరిగిన దాడుల విషయాన్ని జాతీయ మహిళా కమిషన్‌కు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. శాంతియుతంగా న్యాయపోరాటం సాగిస్తున్నామని వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ మాదిరిగానే రాజధాని అమరావతి రైతుల ఆందోళనలకు తమ సంఘీభావం ఉంటుందని జాతీయ రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కొవిడ్ పరిస్థితులు సాధారణమైన అనంతరం తాము రాజధాని గ్రామాల్లో పర్యటనకు వస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: