జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని చంపేయాలని చూస్తున్నారని అమరావతి మహిళా జేఏసీ నేతలు మండిపడ్డారు. అమరావతిపై వైకాపా నేతలు విషం చిమ్ముతున్నారని ఆక్షేపించారు. దిల్లీలో జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి అమరావతికై మద్దతు కోరుతున్నామని స్పష్టం చేశారు.
"పార్లమెంట్లో కూడా అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ విష ప్రచారం చేస్తున్నారు. డీఎంకే నాయకురాలు కనిమొళిని కలిసి అమరావతి రాజధాని నిర్మాణం.. రాజకీయ కక్ష సాధింపులను వివరించాం. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ని కలిసి పార్లమెంట్లో ఈ అంశంపై చర్చ లేవనెత్తాల్సిందిగా కోరాం.జాతీయ నేతలు సుప్రియా సూలే, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో ఇవాళ సమావేశం అవుతాం. జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడం ద్వారా అమరావతిని కొనసాగించడంతో పాటు దేశంలో మరోసారి ఇలాంటి సమస్య తలెత్తకుండా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మూడు రోజుల పాటు జరిగే దిల్లీ పర్యటనలో ప్రధాని, హోంమంత్రిను కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ కోరాం"--అమరావతి మహిళా జేఏసీ
ముఖ్యమంత్రి జగన్ అమరావతిని కొనసాగిస్తామని చెప్పి ఇప్పుడు రైతులకు అన్యాయం చేస్తున్నారని జేఏసీ మహిళా నేతలు మండిపడ్డారు. అమరావతిని తరలించే కుట్ర జరుగుతోందన్నారు. అమరావతికి 40 శాతం మంది దళితులు, అధిక మొత్తంలో బలహీన వర్గాల వారే భూములు ఇచ్చారని వెల్లడించారు.
ఇదీచదవండి