అమరావతి రైతుల ఉద్యమం 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా రైతుల ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి నేడు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి గడపకూ అమరావతి రైతుల ఆవేదన తెలిసేలా అఖిలపక్షాలు, వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాయి. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో శిబిరానికి పది మంది చొప్పున రైతులు నిరాహార దీక్ష చేపడతారు. మరణించిన రైతులకు ఉదయం పదింటీకి నివాళులు అర్పిస్తారు.10.30కు నిరాహార దీక్షలు మెుదలవుతాయి. ఒక్కొ గ్రామంలో 10-15 శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమిస్తారు. సాయంత్రం 7.30 కు అమరావతి వెలుగులో భాగంగా విద్యుత్ దీపాలను ఆర్పేసి కొవ్వొత్తులతో రైతులు, మహిళలు ఇళ్ల ముందు నిరసన తెలుపుతారు.
అఖిలపక్షంతో ఆన్లైన్ సమావేశం
తెదేపా, భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలు, మేథావులతో జూమ్ యాప్ ద్వారా శనివారం ఉదయం 11 నుంచి 12 వరకు వెబినార్ నిర్వహిస్తారు. ఈ సమావేశంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 11 నుంచి 12 గంటల మధ్య ప్రసంగిస్తారు. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్, భాజపా నేతలు మాట్లాడుతారు. 29 గ్రామాల నుంచి మహిళలు ఒక్కొక్కరు మాట్లాడుతారు. అమరావతికి వెలుగు పూల సంఘీభావం పేరుతో ప్రపంచ వ్యాప్తంగా 300 నగరాల్లోప్రవాసులు కార్యక్రమాలను చేపడతారు.