రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగి ఏళ్లు గడిచినా... అభివృద్ధి జరగలేదన్నది అక్కడి రైతుల ఆవేదన. 33 వేల ఎకరాల భూమిని గత ప్రభుత్వం సమీకరించినప్పుడు... భవిష్యత్తులో తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని అంతా ఆశపడ్డారు. కానీ నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని కోసం భూములిచ్చిన వారికి పదేళ్ల వరకు నష్ట పరిహారంతోపాటు... ఏటా 10 శాతం పెంచుతామని గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని ప్రస్తుత సర్కారు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అమాత్యులు రాజధానిపై రోజుకో ప్రకటన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి నిర్మాణం కోసం రైతులందరూ ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీల నేతలను కలసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ని కలిసిన రైతులు… పార్లమెంటులో తమ అభిప్రాయాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండీ...