రాజధాని ప్రాంతం అమరావతి ఆందోళనలతో అట్టుడికింది. మూడు రాజధానుల నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... అసెంబ్లీ ముట్టడికి పెద్దఎత్తున రైతులు, మహిళలు తరలివెళ్లారు. పోలీసుల అడ్డంకులను ఛేదించుకుంటూ....పొలాల వెంట పరుగులు తీస్తూ సచివాలయం చేరుకున్నారు. చీమలదండును తలపిస్తూ ఒక్కసారిగా పరిపాలన భవనాన్ని చుట్టుముట్టిన మహిళలు, రైతులను చూసి పోలీసులు తీవ్ర ఆందోళన చెందారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు సహా మొత్తం ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలోనే ఉండటంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అసెంబ్లీ వెనక గేటు ఎక్కడంతో పెద్దఎత్తున మోహరించిన సాయుధ బలగాలు రైతులు, మహిళలను నిలువరించారు. శాంతియుతంగా తమ నిరసన తెలిపేందుకే వచ్చామని ఆందోళనకారులు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయగా...భూగర్భ డ్రైనేజీ కోసం తవ్విన గుంతల్లో కొందరు పడిపోయారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఎంపీ గల్లా జయదేవ్‌ను సైతం అడ్డుకుని బలవంతంగా అరెస్ట్ చేశారు.
తుళ్లూరు, మందడం, వెలగపూడి సహా రాజధాని గ్రామాల నుంచి పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు. మార్గమధ్యలో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. వారిని నిలువరించేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకున్న చోటే ఎండలో పొలాల్లోనే కూర్చుని రైతులు నిరసన తెలిపారు.
మందడంలో మహిళా రైతులు ఆందోళనకు దిగారు. రహదారిని దిగ్బంధం చేసి ధర్నాకు దిగారు. పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. కృష్ణాయపాలెంలో రైతులు రోడ్డుపై బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు, రైతు కూలీలు రహదారిని దిగ్బంధం చేసి రాస్తారోకో నిర్వహించారు. మూడు రాజధానులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటాయపాలెం, మందడంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇళ్లపై నల్లజెండాలతో రాజధాని గ్రామస్థులు నిరసన తెలిపారు. తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, పాత అమరావతి, దొండపాడులో రహదారిపై అడ్డంగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ముఖ్యమంత్రి సహా మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. మంత్రులు సచివాలయం వెనక మార్గం ద్వారా రావాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: ట్విట్టర్ ట్రెండింగ్‌లో '#అమరావతి'