ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని సకల హంగులతో నిర్మాణం మొదలుపెట్టిన రాజధానిని తరలించాలనుకోవడం ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శనమని అమరావతి రైతులు మండిపడ్డారు. నవ్యాంధ్ర కలల రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చినందుకు తమకు ప్రభుత్వం కన్నీళ్లు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గోడు పట్టించుకోకుండా ముందుకెళ్తున్న సర్కారుకు పరాభవం తప్పదని పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో 196వ రోజు నిరసనలు కొనసాగాయి. తుళ్లూరు, మందడం, ఉద్ధండరాయునిపాలెం, అనంతవరం, వెంకటపాలెం, బోరుపాలెం, దొండపాడు, పెదపరిమి, రాయపూడి తదితర గ్రామాల్లో మహిళలు, రైతులు ఇళ్ల ముందు నిరసనలు కొనసాగించారు. ఆంధ్రులంతా ఒక్కటే..రాష్ట్ర రాజధాని అమరావతి ఒక్కటే అంటూ నినాదాలు చేశారు. పలువురు మహిళలు సేవ్ అమరావతి పేరుతో ఇళ్ల ముందు ముగ్గులు వేసి ప్రభుత్వ తీరును నిరసించారు. అమరావతి వెలుగులో భాగంగా విద్యుత్ దీపాలను ఆర్పివేసి ఇళ్ల ముందు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: వారందరికీ మోదీ అండ- వీరందరికీ హెచ్చరిక