ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోలను హై కోర్టు రద్దు చేయడంపై.. సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. హైకోర్టు తీర్పు ప్రతి ఇంకా తమకు అందలేదని.. రాగానే న్యాయ విభాగంతో చర్చించి ముందుకు వెళ్తామని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఆంగ్ల భాష అందించాలనే సంకల్పంతోనే సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు.
మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కు విద్యార్థులు, తల్లిదండ్రులకే ఇచ్చామని మంత్రి సురేష్ చెప్పారు. ఆంగ్ల మాధ్యమం కావాలని రాష్ట్రంలో అన్ని చోట్ల పేరెంట్స్ కమిటీలు తీర్మానాలు చేశాయని గుర్తు చేశారు. కోర్టు తీర్పును విజయంగానో, అపజయంగానో చూడకూడదన్నారు. తీర్పు ప్రతి రాకముందే ప్రభుత్వంపై తెదేపా విమర్శులు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పును రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దురదుష్టకరమన్నారు.
సంబంధిత కథనం: