టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు సోమవారం ఉదయం నటుడు నవదీప్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు తరచూ హాజరయ్యే సెలబ్రిటీలెవరు? అక్కడ జరిగే పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేస్తారా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎఫ్‌క్లబ్ మేనేజర్‌ని సైతం నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు.
కాగా.. మత్తుమందుల కేసులో ఈడీ చేపట్టిన దర్యాప్తు అగమ్యగోచరంగా తయారైనట్లు సమాచారం. ఇప్పటివరకూ పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్‌ప్రీత్ సింగ్, నందు, రానా, రవితేజలను విచారించినా నిధుల బదిలీపై ఆధారాలేవీ లభించనట్లు తెలుస్తోంది. తమకు కెల్విన్ ఎవరో తెలియదని వాళ్లు విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితులు డ్రగ్స్ సరఫరాదారులు కెల్విన్, వాహిద్‌ను ఈడీ సుధీర్ఘంగా ప్రశ్నిస్తోంది. అనుమానాస్పద లావాదేవీలపై కెల్విన్, వాహిద్‌ను ప్రశ్నిస్తున్నట్లు ఈడీ పేర్కోంది.
ఇదీ చదవండీ.. NARA LOKESH: 'ఫ్యాన్ గుర్తుకు ఓటేసి.. అదే ఫ్యాన్‌కు ఉరివేసుకుంటున్నారు..!'