భరత్‌రెడ్డి(Bharat reddy) తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన నటుడు. స్నేహితుడు, పోలీసు పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వృత్తిరీత్యా భరత్‌రెడ్డి వైద్యుడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తూనే... కళామతల్లి సేవలో నటుడిగా తనను తాను ఆవిష్కరించుకుంటున్నాడు. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే రోగులను పరిశీలించిన ఆయన... 100లో 70 మందికి మధుమేహం ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
మిల్లెట్ మార్వెల్స్...
చిరుధాన్యాలతో తయారు చేసే వంటలను తినమని సలహా ఇచ్చేవాడు. కొంతమంది తన సలహాలను పాటిస్తూ ఆరోగ్యవంతులయ్యేవారు. మరి కొంతమందికి చిరుధాన్యాలతో ఎలా వంట చేసుకోవాలో తెలియక ఇబ్బందిపడేవారు. ఈ విషయాన్ని గ్రహించిన భరత్... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో హైదరాబాద్‌లో చిరుధాన్యాలతో ఆహారం తయారు చేయాలని సంకల్పించాడు. సోదరి ప్రోత్సాహంతో ఫిల్మ్‌నగర్‌లో 'మిల్లెట్ మార్వెల్స్' (Millet marwells) పేరుతో తొలికేంద్రాన్ని ప్రారంభించాడు.
చిరు ఆహారం...
'మిల్లెట్ మార్వెల్స్' (Millet marwells)లో కొర్రలు, అంటుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, కిన్వినా.. ఇలా ఆరు రకాలతో ఆహారాన్ని తయారుచేస్తున్నారు. అల్పహారంతోపాటు భోజనం, స్నాక్స్, ప్రతి శుక్ర, ఆదివారాల్లో దమ్ బిర్యాని సిద్ధం చేస్తున్నారు. ప్రారంభంలో రుచి నచ్చాకే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేవాళ్లు. అలా నెమ్మెది నెమ్మదిగా చాలా మంది భరత్‌రెడ్డి చిరు ఆహారానికి అలవాటుపడ్డారు.
2023 ఏడాదిని కేంద్రం చిరుధాన్యాల ఆహార సంవత్సరంగా ప్రకటించిందన్న భరత్‌రెడ్డి (Bharat reddy).. గడిచిన రెండేళ్ల నుంచి వాటి ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. ప్రతి వ్యక్తి వారానికి ఐదు రోజులు చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే చక్కని ఆరోగ్యం సొంతం అవుతుందని భరత్‌రెడ్డి చెబుతున్నారు.
100 రెట్లు భయంకరం...
కరోనాతో ప్రజలంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రకరకాల ఆహారాన్ని తీసుకుంటున్నారని భరత్ పేర్కొన్నారు. ఐతే ప్రస్తుత మన ఆహార విధానం కొవిడ్ కంటే 100 రెట్లు భయకరమైందని ఆందోళన వ్యక్తం చేశారు. తినే పద్ధతి మారితేనే వచ్చే తరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు.
మిల్లెట్ మార్వెల్స్ (Millet marwells) ద్వారా సుమారు 40 నుంచి 50 మందికి భరత్‌రెడ్డి ఉపాధి కల్పించాడు. ఫిల్మ్‌నగర్‌తోపాటు మరో నాలుగు చోట్ల శాఖలను తెరిచారు. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారం ఖరీదే అయినా ఆరోగ్యంతో పోల్చుకుంటే చాలా తక్కువని మిల్లెట్ మార్వెల్స్ సిబ్బంది చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా...
హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా మిల్లెట్ మార్వెల్స్‌ను విస్తరించాలనే ఆలోచనలో భరత్‌రెడ్డి (Bharat reddy)ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్ శివారులో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా చిరు ధాన్యాలతో చేసిన నూడిల్స్ కూడా వినియోగదారులకు రుచి చూపించబోతున్నారు.
ఇదీ చదవండి :