అమ్మ ఒడికి ఎగనామం పెట్టేందుకు యత్నిస్తున్న జగన్ రెడ్డి పథకాన్ని ఆంక్షల సుడిగా మార్చారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అమ్మఒడి అమలుకు విద్యార్థుల హాజరును సాకుగా చూపటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పాఠశాలలు తెరుచుకోకపోయినా అమ్మఒడి అమలు చేశామని ఆర్భాటంగా చెప్పుకుని, ఇప్పుడు 75శాతం హాజరును బూచిగా చూపటం హేయమని ఆక్షేపించారు. కరోనా సమయంలో ఈ నిర్ణయంతో ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారన్న ఆయన.. రంగులు వేయటం, సలహాదారుల నియామకాలను రద్దు చేసైనా అమ్మఒడి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పథకాల పేరుతో ప్రజల్ని ఊరించి ఉసూరుమనిపించటం జగన్ రెడ్డి నైజమని విమర్శించారు.
బడికి వెళ్లే ప్రతి పిల్లవాడికి అమ్మఒడిని అమలు చేస్తానని ఎన్నికల ముందు మాటిచ్చి ఆ హామీని కూడా విస్మరిస్తూ 84లక్షల మంది విద్యార్ధులకు గాను కేవలం 44లక్షల మందికే పథకాన్ని వర్తింపజేస్తూ సగం మందిని మోసగించారన్నారు. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన ఉపకార వేతనాలు, సైకిళ్లు, విద్యార్ధులకు ఉచిత వైద్యం వంటి అనేక కార్యక్రమాలు రద్దు చేశారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
BTech Ravi : జగన్ చేతకానితనం.. చేతివాటం వల్లే.. రాష్ట్రానికి ఈ దుస్థితి : బీటెక్ రవి