తెలంగాణ యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులకు వీలుగా నిర్మించిన ఇత్తడి, స్టీలు క్యూలైన్ల పనులు దాదాపు పూర్తయ్యాయని యాడా అధికారులు చెబుతున్నారు. ప్రసాద విక్రయశాలలో క్యూలైన్లలో నిలబడి వెళ్లే కౌంటర్ల వరుసలను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవ మండపానికి ఎదురుగా వీటిని బిగిస్తున్నారు. వివిధ ఆకృతులతో ఉన్న వాటిని అష్ట భుజి మండపంలోనూ ఏర్పాటు చేశారు.
క్యూ కాంప్లెక్స్ భవనంలో (భక్తులు వేచి ఉండు గది,) స్టీల్ వరుసలను రెండు భవనాల్లో పనులు పూర్తి కావొచ్చాయి. ప్రధాన ఆలయంలోకి వెళ్లే భక్తులకు ఎండ, వర్షం, తగలకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు..
ఆలయనగరికి రహదారుల నిర్మాణం..
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయనగరికి చేరుకోవడానికి వీలుగా వన్‌వే రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో రెడ్డి సత్రం పక్కనుంచి రహదారి నిర్మాణం చేయగా, మరో రహదారి గండి చెరువు ఎదురుగా ఉన్న గుట్టను తొలచి విశాలంగా చేసి, నిర్మాణం చేస్తున్నారు. వంద ఫీట్ల వెడల్పులో ఈ రహదారి నిర్మాణం చేస్తున్నట్లు, పచ్చదనం కోసం రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటుతున్నట్లు ఆర్ అండ్ బీ శాఖ అధికారులు తెలిపారు.