ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే-2020 పేరిట సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ పరిశ్రమకూ ప్రత్యేకమైన పరిశ్రమ ఆధార్ నెంబర్ జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న కార్మికులు, విద్యుత్, భూమి, నీరు ఇతర వనరులు, ఎగుమతి, దిగుమతులు, ముడి సరకుల లభ్యత, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకోవాలని నిర్ణయించింది.
మొత్తం 9 అంశాల్లో సర్వే వివరాలను సేకరించనున్న పరిశ్రమల శాఖ... గ్రామ, వార్డు సచివాలయల ద్వారా రాష్ట్రంలోని పరిశ్రమల సర్వేను చేపట్టనుంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశ్రమల్లోని వివరాలను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సేకరించనున్నారు. సమగ్ర పరిశ్రమ సర్వే కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రస్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో కమిటీ ఉండనుంది. అక్టోబరు 15 నాటికల్లా సర్వేను పూర్తి చేయాలని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... సంక్షేమాన్ని గాలికొదిలేసి సంక్షోభాలను సృష్టిస్తున్నారు : కళా వెంకట్రావు