రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 ఇంజినీరింగ్ కళాశాలలకు ఈ ఏడాది విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపును నిలిపివేయనున్నారు. విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉండడం, మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు సక్రమంగా లేకపోవడం, గత రెండేళ్లుగా లోపాలను సరి చేసుకుంటామని హామీ ఇస్తూ వస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోనున్నారు. ఇవేకాకుండా విద్యార్థులు, అధ్యాపకుల ఫిర్యాదులనూ పరిగణనలోకి తీసుకుంటారు. వర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నారు. ఆ నివేదికల ఆధారంగా అనుబంధ గుర్తింపు నిలిపివేయనున్నారు. అనుబంధ గుర్తింపు నిలిపివేస్తే ఒక్క కృష్ణా జిల్లాలోనే 7-8 కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు నిలిచిపోనున్నాయి. ఇంజినీరింగ్ సీట్లు అధికంగా ఉండడం, విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉండడంతో నాణ్యత లేని కళాశాలలను తగ్గించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు వర్సిటీలకు సమాచారం అందించింది. గతేడాది 90 కళాశాలలపై చర్యలు తీసుకోవాలని భావించినా చివరికి 40 కళాశాలలకు అనుబంధ గుర్తింపు నిలిపివేశారు. ఈ ఏడాది మరికొన్ని కళాశాలలపై చర్యలు తీసుకోనున్నారు.
గతేడాది 36శాతం ఖాళీ..
గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 1,44,451 సీట్లకు వర్సిటీలు ఆమోదం తెలిపాయి. వీటిల్లో 92,157 భర్తీ అయ్యాయి. అన్ని కళాశాలల్లో కలిపి 36శాతం సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈ ఏడాది ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ 35శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తున్నాయి. ప్రైవేటు వర్సిటీల్లో ప్రవేశాలకు డిమాండు ఉన్నందున ఎక్కువ మంది విద్యార్థులు వీటిల్లో చేరేందుకే ప్రాధాన్యం ఇస్తారు. దీంతో ఇప్పటికే తక్కువగా నిండుతున్న ప్రైవేటు కళాశాలల్లో మరిన్ని సీట్లు మిగిలిపోనున్నాయి.
ఇదీ చదవండీ.. raksha bandhan: రక్షాబంధన్‌కి మరోపేరు ‘జయసూత్రం’