Family suicide at vijayawada : విజయవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం.. ఆత్మహత్య చేసుకుంది. కన్యకాపరమేశ్వరి సత్రంలో తల్లి పప్పుల శ్రీలత(54) , కుమారుడు ఆశిష్(22) అతిగా ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి పప్పుల సురేష్(56), మరో కుమారుడు పప్పుల అఖిల్(28) కృష్ణా నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతులను తెలంగాణ వాసులుగా గుర్తించారు. ఈనెల 6న నిజామాబాద్ నుంచి విజయవాడ వచ్చిన కుటుంబం.. కన్యకా పరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్ పేరుతో రూమ్ తీసుకుంది. తెలంగాణలోని నిజామాబాద్ నుంచి పప్పుల సురేష్ కుటుంబం ఈ నెల దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వచ్చారు. నగరంలోని వన్‌టౌన్‌లో ఉన్న కన్యకాపరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్ పేరుతో కుటుంబం రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. ఈ తెల్లవారుజామున 2.30గంటల సమయంలో అప్పుల బాధతో చనిపోతున్నట్లు బంధువులకు మెసేజ్ పెట్టారు.
బంధువులు స్పందించి సత్రం నిర్వాహకులకు ఫోన్ చేశారు. సత్రం సిబ్బంది, నిర్వాహకులు ఈ కుటుంబం ఉన్న రూమ్‌కు వెళ్లి చూడగా.. తల్లీ కుమారుడు విగతజీవులుగా కనిపించారు. సూసైడ్ చేసుకున్న గదిలో 20 వరకు ఇన్సులిన్ బాటిల్స్, సిరంజీలను పోలీసులు గుర్తించారు. శరీరంలోకి ఇన్సులిన్ బాటిల్స్ 20 వరకు ఇంజెక్టు చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మెడికల్ షాపుతోపాటు బీఫాంసీ చదవడంతో మెడిసిన్స్‌పై ఆశిష్‌కు అవగాహన ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇన్సులిన్ మితిమీరితే షుగర్ డౌన్ అయి చనిపోతారని పోలీసులు వెల్లడించారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనంతరం పోలీసులకు సమాచారం అందింది. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు బంధువుకు వారు మెసేజ్ పెట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: