హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ గ్రూపు.. తన సారథ్యంలోని ఆసుపత్రుల్లో 3డి- ప్రింటింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం అనాటమిజ్ 3డి మెడ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో జట్టు కట్టింది. రోగులకు అవసరమైన వైద్య ఉపకరణాలను ఈ ల్యాబ్స్‌లో సిద్ధం చేసే అవకాశం ఉంటుందని అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వైద్యరంగంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషించారు.
47 ఆసుపత్రులలో..
దేశవ్యాప్తంగా ఉన్న 47 అపోలో హాస్పిటల్స్‌లో అధునాతన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సా కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలు 3డీ- ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించుకుంటాయని అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీతారెడ్డి వివరించారు. రోగులకు బలమైన, తేలికైన, భద్రమైన వైద్య పరికరాలను అతి తక్కువ సమయంలో, తక్కువ ధరలో అందించే అవకాశం ఇందువల్ల ఏర్పడుతుందన్నారు. ఈ విభాగ పరిమాణం 2020లో 1,200 కోట్ల డాలర్లు కాగా, 2025 నాటికి 12,000 కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.
రోగికి అనుగుణంగా..
గత అయిదేళ్లలో ఎన్నో రకాల వైద్య సేవలు 3డి- ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా ఆవిష్కరించినట్లు అనటోమిజ్3డి ముఖ్య సాంకేతిక అధికారి ఫిరోజా కొఠారి అన్నారు. రోగి స్థితిగతుల ఆధారంగా వ్యక్తిగత వైద్య సేవలు అందించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అపోలో హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం వల్ల ఎంతో మందికి మేలు చేయగలుగుతామని పేర్కొన్నారు.
ప్రైవేట్ మార్కెట్‌కు మార్చిలోనే కొవిడ్-19 టీకా?
త్వరలో ప్రైవేట్ మార్కెట్‌కు కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీతారెడ్డి పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య సేవల సిబ్బందికి టీకాలు ఇచ్చే కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా 27 కేంద్రాల్లో ప్రభుత్వంతో కలిసి క్రియాశీలకంగా పనిచేస్తోంది. టీకా ఇవ్వడంపై 6,000 మందికి శిక్షణ ఇచ్చింది. మార్చి నుంచి ప్రైవేట్ మార్కెట్లో కొవిడ్-19 టీకా లభించే అవకాశం ఉందని సునీతారెడ్డి బ్లూమ్‌బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: ముగిసిన మూడో విడత పోలింగ్