రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై వివిధ ప్రాంతాల్లో పలు డిమాండ్లు, ఆకాంక్షలు, ఆందోళనలు, ఉద్యమాలు కొనసాగుతుండగానే కొత్త జిల్లాకేంద్రాల నుంచి పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక శాసనసభ స్థానాన్ని పూర్తిగా ఒక జిల్లా పరిధిలోకే తేవాలన్న నిబంధన పెట్టుకోవడంతోపాటు లోక్‌సభ నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటుచేయడమే ప్రజల ఆందోళనలకు కారణమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలాగని ప్రభుత్వం అన్ని చోట్లా కచ్చితంగా లోక్‌సభ నియోజకవర్గం సరిహద్దులకు కట్టుబడి కొత్త జిల్లాలను ఏర్పాటుచేయలేదు. అవసరమైన చోట ఒక లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను మరో జిల్లా పరిధిలోకి తెచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11వేల అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి. కొన్ని జిల్లాలకు ప్రముఖ జాతీయ, రాష్ట్ర నాయకుల పేర్లు పెట్టాలన్న డిమాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా అమలాపురం, నరసరావుపేట, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇలాంటి డిమాండ్లు ఎక్కువగా వచ్చాయి. పునర్విభజన ప్రక్రియపై జిల్లాలవారీగా ప్రజల ఆకాంక్షలివీ..
శ్రీకాకుళం జిల్లా
* పలాసను రెవెన్యూ డివిజన్ చేయాలి.
విజయనగరం జిల్లా
* మన్యం జిల్లా పేరు మార్చి పార్వతీపురం జిల్లాగా పిలవాలి.
* సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కలపాలి.
* చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్ చేయాలి.
* ఎస్.కోట నియోజకవర్గం విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలో ఉంటుంది. దాన్ని విశాఖ జిల్లా పరిధిలో ఉంచకుండా విజయనగరం జిల్లా పరిధిలోకి తెచ్చారు. ఎస్.కోటకు విశాఖ దగ్గర. అక్కడి ప్రజలకు విజయనగరంతోకంటే విశాఖతోనే అనుబంధం ఎక్కువ. తమను విశాఖ జిల్లాలో చేర్చాలి.
విశాఖ జిల్లా
* పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లి జిల్లాలో కాకుండా విశాఖ జిల్లాలోకి తేవాలి.
* అనకాపల్లి బదులు నర్సీపట్నం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుచేయాలి.
* విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన కొంత ప్రాంతం అనకాపల్లి జిల్లాలోకి వెళుతోంది. ప్లాంట్‌ను, దానికి సంబంధించిన టౌన్‌షిప్ మొత్తాన్ని విశాఖ జిల్లా పరిధిలోకే తేవాలి.
తూర్పుగోదావరి జిల్లా
* రంపచోడవరం నియోజకవర్గాన్ని
పాడేరు కేంద్రంగా ఏర్పాటుచేసే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపడం వల్ల జిల్లాకేంద్రం దూరమవుతుందన్నది అక్కడి ప్రజల ఆందోళన. జిల్లాలోని 11 ఏజెన్సీ మండలాలతో రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటుచేయాలన్నది వారి డిమాండ్.
* అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలం కాకినాడకు సమీపంలో ఉండటంతో దాన్ని కాకినాడ జిల్లాలో కలపాలన్నది అక్కడి ప్రజల డిమాండ్.
* అమలాపురం జిల్లా పరిధిలోకి వచ్చే మండపేట నియోజకవర్గంలోని మండపేట మండలాన్ని, కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో కలపాలి.
పశ్చిమగోదావరి జిల్లా
* పశ్చిమగోదావరి భీమవరాన్ని జిల్లాకేంద్రం చేయడంపై నర్సాపురం వాసుల అభ్యంతరం. నర్సాపురాన్నే జిల్లాకేంద్రంగా చేయాలని డిమాండ్. గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలోనే ఉంచాలి. ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండలాన్ని భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలోనే ఉంచాలి. రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటుచేసి పోలవరం నియోజకవర్గాన్ని దాని పరిధిలోకి తేవాలి.
కృష్ణా జిల్లా
* కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు విజయవాడ నగరంలో భాగంగానే ఉంటాయి. అవి మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలో ఉండటంతో జిల్లాల పునర్విభజనలో వాటిని మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటుచేసే జిల్లాలోకి తేవడంపై తీవ్ర అభ్యంతరం. ఆ 2నియోజకవర్గాల్ని విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్. నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలపకుండా.. విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలోనే ఉంచాలని డిమాండ్. మైలవరం, అవనిగడ్డ, ఉయ్యూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్.
గుంటూరు జిల్లా
* నరసరావుపేట బదులు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటుచేయాలి.
* రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయాలి.
* తెనాలికి సమీపంలోని చుండూరు, వేమూరు మండలాల ప్రజలు తమను బాపట్ల జిల్లాలో కాకుండా గుంటూరు జిల్లాలోనే ఉంచాలని కోరుతున్నారు.
* సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలకు కలిపి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేయాలి.
ప్రకాశం జిల్లా
* పశ్చిమ ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనకబడిన ప్రాంతాలైన గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, మార్కాపురం నియోజకవర్గాల్ని కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేయాలి.
* మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా చేయనట్లయితే తమ నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లాలో కలపాలన్నది గిద్దలూరు ప్రజల డిమాండ్. గిద్దలూరు నియోజకవర్గానికి నంద్యాల 60 కి.మీ.దూరంలో ఉంటే.. ఒంగోలు 150 కి.మీ.ల దూరంలో ఉంటుంది.
* కందుకూరు నియోజకవర్గాన్ని ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్. నెల్లూరు తమకు 111 కి.మీ.ల దూరముందని, తమను ప్రకాశం జిల్లాలోనే ఉంచి రెవెన్యూ డివిజన్‌నూ కొనసాగించాలన్నది అక్కడి ప్రజల డిమాండ్. ప్రతిపాదిత రామాయపట్నం పోర్టు కందుకూరు నియోజకవర్గం పరిధిలోకే వస్తుందని, కందుకూరును నెల్లూరు జిల్లా పరిధిలోకి తెస్తే తాము ఉద్యోగావకాశాలు కోల్పోతామని జిల్లావాసుల ఆందోళన.
*తమను ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని అద్దంకి నియోజకవర్గ ప్రజల డిమాండ్.
నెల్లూరు జిల్లా
* ఉదయగిరి కేంద్రంగా ప్రత్యేక జిల్లా చేయాలని రెండేళ్లుగా ఈ ప్రాంత ప్రజల డిమాండ్. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, కడప జిల్లాలోని బద్వేలుని కలిపి ప్రత్యేక జిల్లా చేయాలని విజ్ఞప్తి.
* గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా పరిధిలోకి తేకుండా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని డిమాండ్.
అనంతపురం జిల్లా
*పుట్టపర్తి కేంద్రంగా ప్రతిపాదించిన శ్రీసత్యసాయి జిల్లాను అదే పేరుతో హిందూపురం కేంద్రంగా ఏర్పాటుచేయాలి. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలి. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలాన్ని కల్యాణదుర్గంలో కాకుండా అనంతపురం రెవెన్యూ డివిజన్‌లో కలపాలి.
కడప జిల్లా
* రాయచోటికి బదులు రాజంపేటను జిల్లాకేంద్రంగా ప్రకటించాలి. లేనిపక్షంలో రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి.
* బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేయాలి.
* రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీబాలాజీ జిల్లాలో కలపాలి.
* రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలో కలపాలి.
చిత్తూరు జిల్లా
* మదనపల్లె కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేయాలి.
* చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీబాలాజీ జిల్లాలో కలపాలి. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలి. శ్రీకాళహస్తి, కుప్పంలను రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించాలి.
కర్నూలు జిల్లా
* ఆదోని కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేయాలి. ఆదోని డివిజన్‌లోని కౌతాళం, కోసిగి వంటివి వెనకబడిన ప్రాంతాలు. రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచీ ఆదోని కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ఉంది.
* పాణ్యం నియోజకవర్గం ఇటు కర్నూలునుంచి అటు నంద్యాల వరకు ఉంటుంది. దీనిలో కల్లూరు, ఓర్వకల్లు మండలాలు కర్నూలుకు దగ్గరగా.. పాణ్యం, గడివేముల నంద్యాలకు సమీపంలో ఉంటాయి. పాణ్యం నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటులో దాన్ని కర్నూలు జిల్లా పరిధిలోకి తెచ్చారు. నంద్యాలకు 10-15 కి.మీ.దూరంలో ఉన్న తమను 60 కి.మీ.ల దూరంలోని కర్నూలు కేంద్రంగా ఉన్న జిల్లాలో కలపడమేంటని పాణ్యం, గడివేముల మండలాల ప్రజలు నిరసన తెలుపుతున్నారు. తమ మండలాల్ని నంద్యాల జిల్లాలో కలపాలని డిమాండ్.
* నందికొట్కూరు, డోన్ నియోజకవర్గాలను కర్నూలు జిల్లాలో కలపాలని డిమాండ్.
ఇదీ చదవండి: "పన్నులు కట్టకపోతే.. స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయి?"