గురుపూజ మహోత్సవాలకు కడప జిల్లా బ్రహ్మం గారి మఠం సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ నుంచి 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ సిబ్బంది ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఆవరణం, ముందు భాగంలో చలువ పందిళ్లు వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని తెలిపారు. బ్రహ్మంగారి మఠానికి దర్శించుకునే భక్తుల కోసం మైదుకూరు, బద్వేలు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
మహోత్సవాల కార్యక్రమాల క్రమం
ఈనెల 11న అభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని నిర్వహకులు తెలిపారు. 11వ తేదీ రాత్రి శేషవాహన ఉత్సవం, 12న గజవాహన సేవ, 13న నరనంది ఉత్సవం ఉంటాయని తెలిపారు. వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి అయిన రోజు... వైశాఖ శుద్ధ దశమి 14న స్వామి వారు వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వేషధారణలో దర్శనమివ్వనున్నారని వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం దీక్షా బంధన అలంకార ఉత్సవం నిర్వహిస్తామన్నారు. 15వ తేదీన స్వామివారి బ్రహ్మ రథోత్సవం ఉంటుందని మఠ నిర్వహకులు తెలిపారు.
ఇవీ చూడండి : గెలుపు ఖాయం... ఆధిక్యతే ప్రధానం: చంద్రబాబు