సిలిండర్‌లో గ్యాస్ అయిపోతే... ఇస్త్రీ పెట్టెపైనే దోసెలు వేసేస్తాడు ఓ సినిమాలో కథానాయకుడు. ఇప్పుడు కాలం మారింది. అదే గ్యాస్‌తో ఇస్త్రీ పెట్టెలు కూడా వేడెక్కుతున్నాయ్. బొగ్గు అవసరం లేదు... మంట పెట్టాల్సిన పని అంతకన్నాలేదు... విద్యుత్ అవసరమూ ఉండదు. పొగలు కక్కకుండానే దుస్తులను సాఫీగా ఇస్త్రీ చేసేసుకోవచ్చు. బట్టలపై సర్రున జారుతూ... ఇస్త్రీ చేస్తున్న ఈ పెట్టె పనిచేసేది గ్యాస్‌తోనే. ఇన్నాళ్లూ వంటలు చేసేందుకు, వాహనాలు నడిపేందుకు మాత్రమే వినియోగించిన గ్యాస్.... ప్రస్తుతం ఇస్త్రీ పెట్టెలకూ కాక పుట్టిస్తోంది.
వినడానికి, చూడటానికి ఆసక్తిగా, వినూత్నంగా ఉన్న ఈ ఇస్త్రీ పెట్టెలను.... భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విపణిలోకి తెచ్చింది. విశాఖలో ఇటీవలే అందుబాటులో వచ్చిన కొత్తరకం ఇస్త్రీ పెట్టెలు.... అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ గ్యాస్ ఇస్త్రీ పెట్టె బరువు ఆరున్నర కేజీలు. వెనుక భాగంలో ఉన్న మీట సాయంతో... వేడి స్థాయి పెంచొచ్చు, తగ్గించొచ్చు. బొగ్గుతో పోల్చితే... పెట్టుబడీ తక్కువే అంటున్నారు అమ్మకందారులు, కొనుగోలుదారులు.
ఖర్చు సంగతేమో కానీ.... గ్యాస్ ఇస్త్రీ పెట్టెలతో పొగబారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఫలితంగా కాలుష్యమూ కొద్దిమేర తగ్గుతుంది.
ఇవి చూడండి: అందరి కళ్లూ చారులతా బామ్మ వైపే...