కాసిన్ని విత్తనాలు దొరికితే...దుక్కులు దున్నుకోవడానికి కర్షకులు సిద్ధమవుతారు. మార్కెట్లో నకిలీ విత్తనాల తంటాలు పడలేక..ఏటా ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాల కోసం గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు రైతులు.
నాలుగు బదులు రెండే బస్తాలు
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు వేరుశెనగ విత్తనాల పంపిణీ చేపట్టింది ప్రభుత్వం. విత్తన పంపిణీలో ఎదురౌతున్న సమస్యలు తెలిసినా...వ్యవసాయ శాఖ పూర్తిస్థాయిలో సమాయత్తం కాలేకపోయింది. అరకొరగా విత్తన పంపిణీ చేపడుతూ రైతుల ఆగ్రహానికి కారణమౌతుంది. ఒక్కో పట్టాదారు పాసు పుస్తకానికి మూడు నుంచి నాలుగు బస్తాల విత్తనాలు అందిస్తారు...కానీ ఈసారి రెండు బస్తాలే ఇస్తున్నందున రైతులు ఆందోళనకు గురవుతున్నారు. విత్తన పంపిణీ మొదటి దశలో కొన్ని గ్రామాల్లో మూడు, నాలుగు బస్తాలు సరఫరా చేశారు. కానీ చివరికి వచ్చేసరికి రెండు బస్తాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అప్పుల భారంతో ఉన్న రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు విత్తనాలు కొనలేని పరిస్థితి నెలకొంది.
సాగు నడవాలంటే సాయం అందాలి
రాయలసీమ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న విత్తన పంపిణీ..గందరగోళంగా మారింది. పంపిణీ కేంద్రాల వద్ద రైతులు గంటల కొద్ది క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కనీసం నాలుగు బస్తాల విత్తనాలు అందిస్తే...సాగునడుస్తుందని రైతులు తమ గోడు వెల్లడిస్తున్నారు.
ఇదీ చదవండి : వరుణుడి కరుణ కోసం... ఐక్యమత పూజలు