ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు.. మే 23 ఓట్ల లెక్కింపునకు మధ్య ఎక్కువ విరామమే వచ్చినా రాజకీయ వేడి మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. గెలుపుపై ధీమాతో జబ్బలు చరుస్తూ... తొడలు కొడుతూ రాజకీయ ప్రత్యర్థులు సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం.. ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ కౌంటింగ్ కేంద్రాలు, ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే కేంద్రాల్లో టేబుళ్ల ఏర్పాటు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు రోజున పార్టీ అభ్యర్థుల తరఫున హాజరయ్యే ఏజెంట్లకు అనుమతి పత్రాలు జారీచేశారు. సోమవారం నాడు జిల్లాలోని 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. ఓట్ల లెక్కింపుపై ఆర్వోలకు కలెక్టర్ సూచనలు ఇచ్చారు.
ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రూపొందించిన సువిధ యాప్‌తో.. రిటర్నింగ్ అధికారుల ఫోన్ నంబర్లను అనుసంధానం చేయనున్నారు. లెక్కింపులో పాల్గొనే ఉద్యోగులకు ర్యాండమైజేషన్ పద్ధతిలో విధులు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్లను ముందురోజున కౌంటింగ్ కేంద్రాలకు తరలించి భద్రత కల్పిస్తామన్నారు.
ఈ నెల 23న ఉదయం ఐదున్నరకు ఉద్యోగులు, ఉన్నతాధికారులు విధులు కేటాయించనున్నారు. ఉదయం 6 గంటలకు స్ట్రాంగ్‌రూం తెరిచి ఈవీఎంలను లెక్కింపు కేంద్రానికి తరలిస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 3,100 మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రతి టేబుల్ వద్ద పరిశీలకుడు, సహాయకుడు, సూక్ష్మ పరిశీలకులు ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో గెజిటెడ్ అధికారులు ఉంటారు. వీరి సహాయకులుగా రహదారులు భవనాల శాఖ నుంచి డీఈ, ఏఈలను నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున కేటాయిస్తారు.
గుంటూరు, బాపట్ల పార్లమెంట్ స్థానాలతో పాటు, వీటి పరిధిలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగనుంది. నర్సరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు, మరో 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నల్లపాడులోని లయోలా పాఠశాల ప్రాంగణంలో జరగనున్నట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు.
కౌంటింగ్ జరగనున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నల్లపాడు లయోలా పాఠశాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. లెక్కింపు గదుల్లోకి పోలీసులను అనుమతించరు. కౌంటింగ్ గదిలోకి వెళ్లడానికి రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరి చేశారు.
ఇవీ చూడండి : 'పరిశోధన ఫలాలు ప్రజలకు చేరినప్పుడే సార్థకత'