ప్రైవేటు విద్యాసంస్థలో చదివే విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసే విషయమై త్వరలో ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకుంటారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తింపజేస్తామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు విషయమై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. ఈ పథకాన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు అమలు చేయాలని వినతులు వస్తోన్నాయని మంత్రి తెలిపారు.
విద్యాశాఖ అధికారులు సహా విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఈ అంశంపై సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మార్చి ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. విద్యాశాఖలో పలు విభాగాల్లోని ఇంజినీరింగ్ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని.....అందరినీ ఏకతాటిపైకి తెస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పెంపు, ప్రహరీ గొడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రాబోయే 2 ఏళ్లల్లో చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించామన్నారు. విశ్వవిద్యాలయాల బలోపేతానికి కృషి చేస్తామని..సమస్యలను పరిష్కరిస్తామన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫీజు రీ-ఎంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపైనా సీఎం జగన్ త్వరలో స్పష్టత ఇస్తారని తెలిపారు.
ఇదీ చదవండి : "ఉన్నస్థితి నుంచి... ఉన్నత స్థితికి పాఠశాలలు"