సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం గత 2 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన అంశాలపై దృష్టి సారించారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు, తాగునీటి పరిస్థితులపై సమీక్షలు నిర్వహించారు. 45 రోజుల తర్వాత సచివాలయానికి వచ్చిన చంద్రబాబు..సీఆర్‌డీఏ, పురపాలన, శాంతిభద్రతలపై సమీక్షలు నిర్వహించాలని భావించారు. సీఆర్‌డీఏ పనుల పురోగతి అంశాలపై సీఎం నిర్వహించిన సమీక్షకు సీఎస్ ఎల్.వి.సుబ్రమణ్యం హాజరుకాలేదు. సీఎం నిర్వహించిన ఈ సమీక్షలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిశితంగా గమనించింది.
కోడ్ ఉల్లంఘనేనా!
ఓట్ల లెక్కింపు జరిగే మే 23 వరకు రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉంటుంది. సీఎం సమీక్షలు నిర్వహించిన అంశం ఈసీ దృష్టికి వచ్చిందన్న ద్వివేదీ...జరిగిన సమీక్షలు, చర్చించిన అంశాలపై స్పందించేందుకు నిరాకరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంశంపై మాట్లాడిన ద్వివేదీ...ప్రవర్తన నియమావళిని అన్ని ప్రభుత్వ శాఖలకు పంపినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా...ఏ ఇతర సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ల నిర్వహణ, హామీలు ఇవ్వడం చేయరాదని గుర్తుచేశారు.
సచివాలయానికి వచ్చిన 15వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎస్ మాత్రమే సమావేశమయ్యారు. ఎన్నికల కోడ్ కారణంగా సీఎం హాజరుకాలేదు. సీఆర్‌డీఏతో సమీక్ష అనంతరం చంద్రబాబు శాంతిభద్రతలపై చర్చించాల్సి ఉండగా...ఆ సమీక్షను వాయిదా వేసుకున్నారు.
సీఈసీ ఆరా
ఎన్నికల అనంతరం ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. శాంతిభద్రతలపై గవర్నర్ నరసింహన్‌కు వైకాపా అధ్యక్షుడు జగన్ ఫిర్యాదు చేసిన తరుణంలో.. ఈసీఐ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నివేదిక కోరింది. డీజీపీ ఇచ్చిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు ద్వివేదీ తెలిపారు. ఈనెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది మధ్య జరిగిన సంభాషణ వీడియోను సీఈసీ పంపినట్లు తెలిస్తోంది.