కడప వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ లూర్దయ్యనాయుడు... అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. కోట్లాది ఆస్తులు అక్రమంగా కూడబెట్టారన్న ఆరోపణలపై... ఊచలు లెక్కపెడుతున్నారు. 1989లో వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. 2007 నుంచి భారీగా అక్రమాస్తులు సంపాదించడం మొదలు పెట్టనట్టు ఆరోపణలు వచ్చాయి.
ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నారనే అభియోగాలతో.. అవినీతి నిరోధకశాఖ అధికారులు ఏకకాలంలో లూర్దయ్య నివాసం, బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. కడప అనిశా డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో.. లూర్దయ్య ఆస్తుల వివరాలు తెలుసుకున్నారు. తనిఖీల్లో 750 గ్రాముల బంగారం, కిలో వెండి ఆభరణాలు, నాలుగున్నర లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పలు బ్యాంకుల పాసుపుస్తకాలు, ఆస్తుల డాక్యుమెంట్లు పరిశీలించినట్లు అనిశా అధికారులు తెలిపారు.
ఆస్తుల వివరాలు
లూర్దయ్య నాయుడు ఇంట్లో లభించిన ఆస్తుల పత్రాల ఆధారంగా ఆయనకు కర్నూలు సరస్వతి నగర్లో జీ ప్లస్ 1 భవనం, కమర్షియల్ కాంప్లెక్సు.... చాగలమర్రిలో మరో జీ ప్లస్ 1 భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డిప్యూటీ కమిషనర్ భార్య, నలుగురు కుమార్తెల పేరిట చాగలమర్రిలో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఆయన వియ్యంకుడి పేరిట 2 ఎకరాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కడపతో పాటు విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లోని లూర్దయ్య ఆస్తులపై అనిశా సోదాలు చేసింది. ఆయన భార్య, కుమార్తెల పేరిట హైదరాబాద్, చాగలమర్రి, కర్నూల్ పలు బ్యాంకుల్లో రూ.41 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు.
లూర్దయ్య తాను తప్పు చేయలేదని ఓ వైపు వాదిస్తుండగా.. మరోవైపు కర్నూలు సిండికేట్ బ్యాంకులో లూర్దయ్య, ఆయన భార్య పేరిట జాయింట్ అకౌంట్ లాకర్ ఉందని అనిశా గుర్తించింది. ఈ లాకర్ తెరిస్తే మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి : అభ్యర్థులు కోరినచోట ఓట్లను మళ్లీ లెక్కించాలి: బాబు