Four farm workers die of electrocution: వారంతా కూలీలు. పని కోసం పొలానికి వెళ్లారు. పనులు పూర్తయ్యాక.. వచ్చిన ట్రాక్టర్‌లోనే తిరిగి ఇంటికి బయల్దేరారు. ఇంతలో ఊహించని ప్రమాదం. దగ్గర్లోనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్‌పై పడ్డాయి. చూసేసరికి నలుగురు కూలీలు చనిపోయి ఉన్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. వైఎస్‌ఆర్ జిల్లాలో పొలంలో క్రిమిసంహారక మందు పిచికారీ చేయడానికి వెళ్లి.. విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు రైతులు మృతిచెందిన ఘటన మరువక ముందే.. అనంతపురం జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకుని ఇంటికొచ్చే సమయంలో విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగి పడటంతో.. నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి.
బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరుకు చెందిన కూలీలు వ్యవసాయ పనులు ముగించుకుని తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఎక్కుతుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు తెగి కిందపడ్డాయి. తప్పించుకునేలోపే నలుగురు అశువులు బాశారు. మృతులను పార్వతి, శంకరమ్మ, వన్నమ్మ, రత్నమ్మగా గుర్తించారు. అప్పటివరకూ తమతో కలిసి పనిచేసిన వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో.. తోటి రైతు కూలీలు కన్నీటి పర్యంతమయ్యారు. మరికొందరికి గాయాలవ్వగా..ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని బళ్లారిలోని విజయనగర్ వైద్య విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్‌లో(విమ్స్) చేర్పించారు. సుంకమ్మ (42) సావిత్రి అలియాస్ లక్ష్మి (32) అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రి వైద్యులు అత్యవసర విభాగంలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన మరో వంశీ(19) కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదాలు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది: వ్యవసాయ కూలీల మృతి ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమన్నారు. విద్యుత్ తీగలు తెగిపడటం.. వారం రోజుల్లో ఇది రెండోసారని.. కొన్ని రోజుల క్రితం ఈ తరహా ప్రమాదంలో ఐదుగురు చనిపోయారన్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. విద్యుత్ శాఖ పర్యవేక్షణ కరువయ్యిందని ధ్వజమెత్తారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రభుత్వానికి పట్టదా అని నిలదీశారు. ప్రమాద ఘటనలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. ప్రజల పాలిట శాపంగా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలు తెగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని మండిపడ్డారు.
పరిహారం ప్రకటించిన ప్రభుత్వం: అనంతపురం జిల్లాలో విద్యుత్ ప్రమాద ఘటనలో మరణించిన మహిళా కూలీల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించినట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: