"చాలా ఏళ్ల క్రితం మీ దగ్గర రూ.700 విలువైన సరకు దొంగతనం చేశా. ఇప్పుడు ఈ రూ.2000 తీసుకుని నన్ను క్షమించండి" అంటూ వచ్చిన లేఖ.. కేరళలోని ఓ మహిళను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అసలు ఈ లేఖను ఎవరు పంపారా అని ఆమె ఆలోచనలో పడింది.
మేరీ.. కేరళ వయనాడ్ జిల్లా పుల్పల్లి సమీపంలోని పట్టనికూప్ వాసి. భర్త జోసెఫ్ పదేళ్ల క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటోంది. బుధవారం ఆమెకు ఓ లేఖ వచ్చింది. క్రిస్మస్ సమయంలో పిల్లలు, బంధువుల నుంచి గ్రీటింగ్ కార్డులు తప్ప.. ఆమెకు ఎప్పుడూ పోస్ట్‌లో ఉత్తరాలు రావు. అందుకే ఈ లేఖ ఎవరు పంపి ఉంటారా అని ఆమె ఆసక్తిగా చూసింది. కానీ.. కవర్‌పై పంపిన వ్యక్తి పేరు లేదు.
అలానే అనుమానంగా కవర్ తెరిచి చూసింది మేరీ. లోపల ఓ లేఖ, నాలుగు రూ.500 నోట్లు ఉన్నాయి. "ప్రియమైన మేరీ అక్క.. చాలా ఏళ్ల క్రితం నేన జోసెఫ్ దగ్గర రూ.700 విలువైన సామగ్రి దొంగిలించా. ఇప్పుడు ఆ సరకు విలువ రూ.2000 ఉంటుంది. ఈ లేఖతో పాటు ఆ డబ్బులు పంపుతున్నా. ఇవి తీసుకుని నన్ను క్షమించండి" అని ఉంది.
భర్త కూడా లేనందున ఈ లేఖ ఎవరు రాశారో ఇప్పుడు తెలుసుకోలేనని అంటోంది మేరీ. మిగిలిన దొంగలు కూడా ఇదే తరహాలో పశ్చాత్తాపం పొందితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.