అమెరికా, రష్యా మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న మధ్యంతర స్థాయి అణు ఆయుధాల ఒప్పందం (ఐఎన్ఎఫ్ ట్రీటీ) నుంచి వైదొలుగడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా ఒప్పందాన్ని ఉల్లంఘించి అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఆరోపిస్తోంది అమెరికా. రష్యా అణ్వాయుధాలను నాశనం చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఐఎన్ఎఫ్ ఒప్పందం
ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ (ఐఎన్ఎఫ్) ఒప్పందం ఆయుధాల నియంత్రణలో చేపట్టిన మొదటి చర్యగా చెప్పవచ్చు. 1987 నాటి ఒప్పందం ప్రకారం 500 కిలోమీటర్ల నుంచి 5,500 కిలోమీటర్ల పరిధిలోని క్రూయిజ్ క్షిపణుల ప్రయోగాన్ని నిషేధిస్తోంది ఈ ఒప్పందం
డిసెంబర్ 2018లో ఒప్పందం నుంచి వైదొలగడానికి సాధారణ నోటిఫికేషన్ ఇచ్చే లోపు రష్యా వెనక్కి తగ్గాలని 60 రోజుల గడువు ఇచ్చింది అమెరికా. సాధారణ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత ఆరు నెలల్లో పూర్తి ఉపసంహరణ ఉంటుందని తెలిపింది. 60 రోజుల గడువు నేటితో ముగియనుంది.
ప్రజల్లో ఆందోళన
ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయి. ఇరు దేశాల భవిష్యత్తుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఒప్పదం నుంచి వైదొలగటం సరికొత్త క్షిపణి పోరాటానికి నాంది పలుకుతున్నట్లవుతుందని అణు ఆయుధాల నిపుణులు పేర్కొంటున్నారు.
చైనాపై ఆధిపత్యానికే...
మధ్యంతర స్థాయి క్షిపణి ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా చైనాపై ఆధిపత్యానికే ఈ చర్యలు చేపడుతోందని రష్యా ఆరోపించింది. 1987 అణు ఆయుధాల నియంత్రణ ఒప్పందంలో లేని ఆయుధాలను చైనా తయారు చేయడంపై అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారని తెలిపింది. ఐఎన్ఎఫ్ ఒప్పందం నుంచి వైదొలిగితే ట్రంప్ పరిపాలనకు చైనాను ఎదుర్కోవటానికి అవకాశం లభించనుంది. దేశాంతర, ఖండాంతర క్షిపణులను తయారు చేసే వీలు కలుగుతుందనే అమెరికా ఒప్పందం నుంచి వైదొలగాలని చూస్తోందని ఆరోపించింది.