నంద్యాల జిల్లాలో దారుణం - కర్రలతో దాడి చేసి టీడీపీ నేత హత్య - TDP ACTIVIST BRUTAL MURDER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 26, 2024, 12:41 PM IST
Three Persons Attacked and Killed TDP Activist in Nandyal District : రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన దాడులు, దౌర్జన్యాలు ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో కొంత మంది వీధి గుండాల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం కార్యకర్తపై కొంత మంది కర్రలతో దాడి చేయడంతో హరిప్రసాద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రుద్రవరం గ్రామంలో చోటు చేసుకుంది. రుద్రవరం గ్రామంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, చిన్న మద్దయ్యలకు టీడీపీ కార్యకర్త అయిన హరిప్రసాద్ మధ్య ఇదివరకే పాత కక్షలు ఉన్నాయి.
దీన్ని మనసులో ఉంచుకున్న ప్రత్యర్థి వర్గం వారు ఈరోజు అదునుచూసి ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో హరిప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హరిప్రసాద్ అక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో హరిప్రసాద్ కోట్ల కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.