హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు - చంద్రబాబుకు తప్పిన ముప్పు - చంద్రబాబు హెలీకాప్టర్ లో సమస్యలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 10:15 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రా కదలిరా సభ కోసం అరకు వెళ్లాల్సిన హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్య, రూట్ సమస్య ఏర్పడడం కొంతసేపు ఆందోళన నెలకొంది. షెడ్యూల్ ప్రకారం విశాఖ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న చంద్రబాబు, హెలీకాప్టర్ లో అరకు వెళ్లి అక్కడి నుంచి మండపేట చేరుకోవాల్సి ఉంది. ఈక్రమంలో 12 గంటల సమయంలో విశాఖ విమానాశ్రయంలో దిగిన చంద్రబాబు హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్య అరగంట సేపు రన్ వే పైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏటీసీ నుంచి అందుకున్న సిగ్నల్ ను హెలీకాప్టర్ పైలెట్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల గాల్లోకి వెళ్లిన తర్వాత అరకు రూట్ కాకుండా వేరే రూట్లో పయనం సాగించింది.
హెలీకాప్టర్ లో తప్పిదాన్ని గుర్తించిన ఏటీసీ సిబ్బంది తిరిగి విమానాశ్రయానికి రావాల్సిందిగా సిగ్నల్స్ ఇచ్చారు. పది హేను నిమిషాల పాటు గాల్లోనే హెలీకాప్టర్ ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత విశాఖ విమానాశ్రయంలో ఇంధనాన్ని నింపుకుని 1.20 గంటల ప్రాంతంలో తిరిగి అరకు బయలు దేరింది. వాస్తవంగా 12.05 నిమిషాలకు బయలుదేరాల్సిన ఈ హెలీకాప్టర్ ఈ రకమైన సమస్యల కారణంగా దాదాపు గంటా 15 నిమిషాలకు పైగా అలస్యంగా బయలుదేరింది. వీఐపీ హెలీకాప్టర్ ఈ రకంగా సమస్య ఎదురుకావడంతో డీజీసీఏ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. విశాఖ నుంచి అరకు ఆ తర్వాత మండపేట వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ఈ హెలీకాప్టర్ లో తొలుత సాంకేతిక సమస్య, తర్వాత రాంగ్ రూట్ పట్టడం, అపై ఇంధన సమస్య ఎదురు కావడంతో అధికార్లు, పార్టీ శ్రేణులు కలవరపాటునకు గురయ్యాయి.