మధ్యాహ్న భోజన ఏజెన్సీతో విభేదాలు - పాఠశాలకు తాళం వేసిన సర్పంచ్ భర్త - satyasai district school lock
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 2:53 PM IST
Sarpanch Husband Lock to Government School : శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇరగంపల్లి పంచాయతీ వంగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు సర్పంచ్ భర్త తాళం వేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీతో తలెత్తిన విభేదాల కారణంగా వైసీపీ నాయకుడు శ్రీనివాసులు పాఠశాలకు తాళం వేశారు. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిన సర్పంచ్ భర్త శ్రీనివాసులు విద్యార్థులను బయటకు పంపి గేటుకు తాళం వేశాడు. దీంతో చేసేదేమీలేక ఉపాధ్యాయుడు, పిల్లలు వెనుదిరిగారు.
మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారు తమకు గిట్టుబాటు కావడం లేదని వారం రోజులుగా రావడం లేదని గ్రామస్థులు తెలిపారు. దీంతో ఉపాధ్యాయుడే పిల్లలకు భోజనం పెట్టిస్తున్నారని చెప్పారు. వేరే వ్యక్తులతో భోజనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుండటంతో తనకు సమాచారం ఇవ్వలేదని సర్పంచ్ భర్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. ఉదయం పాఠశాలకు వచ్చి గేటుకు తాళం వేసి వెళ్లిపోయారని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను పునఃప్రారంభించాలని కోరారు. భవనానికి తాళం వేసిన సర్పంచ్ భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.