అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం లేని రాష్ట్రం కావాలి: జేడీ లక్ష్మీనారాయణ - Jai Bharat National Party
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 8:13 PM IST
JD Lakshminarayan Allegations on CM Jagan: అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, ప్రకృతి విధ్వంసం లేని రాష్ట్రం కావాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా రూపొందించినట్లు తెలిపారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా తమ మేనిఫెస్టో తరహాలో ప్రజలకు మేలు కలిగే మేనిఫెస్టోలు రూపొందించాలని సూచించారు. 22 మంది ఎంపీలు ఇస్తే వైసీపీ ప్రభుత్వం ఏం సాధించిందని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి నాలుగు సార్లు అవకాశం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని, ఒక్కో గ్రామపంచాయతీకి రూ. కోటి మంజూరు చేయాలన్నారు. గ్రామ పంచాయతీల నిధులను మళ్లించడం వల్ల సర్పంచులు ముసుగులు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. గ్రామపంచాయతీ నిధులను మళ్లీస్తే, 73, 74 రాజ్యాంగ సవరణ చేయడం ఇంకెందుకు అని లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా ప్రశ్నించారు.