పంట ఆఖరి దశలో నీటిని నిలిపివేసిన అధికారులు - ఆగ్రహం వ్యక్తం చేసిన రైతన్నలు
🎬 Watch Now: Feature Video
Farmers Concerns for Water in Tirupati District : తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని తెలుగుగంగ ప్రధాన కాలువ అక్విడెక్ట్ వద్ద వరి రైతులు ఆందోళన చేపట్టారు. వరి పంట ఆఖరి దశలో ఉండగా అధికారులు నీటని నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలకు అండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ కురుగొండ్ల రామకృష్ణ మద్దతు తెలిపారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి పంట ఆఖరి దశలో ఉన్న సమయంలో అధికారులు నీటిని నిలిపివేశారు. దీంతో ఆరుగాలం శ్రామించి పండించిన పంటని బతికించుకోవాలని అక్విడెక్ట్ దగ్గర రైతులు పైపులు వేసి స్థానిక కాలువకు తెలుగుగంగ నీటిని మళ్లించారు. విషయం తెలుసుకున్న అధికారులు రాత్రి సమయంలో వచ్చి వాటిని ధ్వంసం చేశారని రామకృష్ణ తెలిపారు.
రైతులకు అండగా ఉండాల్సిన సమయంలో పైపులను తొలగించటం దారుణమన్నారు. గతంలో కండలేరు రిజర్వాయర్లో 5,6 టీఎంసీలు పరిధిలో నీటి మట్టం ఉన్నప్పుడే లిఫ్ట్ పద్ధతిలో పంటలకు నీటిని మళ్లించామన్నారు. కానీ, ప్రస్తుతం 11 టీఎంసీలు ఉన్న ప్రభుత్వం రైతులను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తుందని ప్రశ్నించారు. అనంతరం నీటి సమస్య గురించి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు.