కారంపూడిలో టీడీపీ నాయకుల కార్లపై వైసీపీ శ్రేణుల దాడి
🎬 Watch Now: Feature Video
Conflict Between TDP And YCP Activists Destroyed Two Cars: ఎన్నికల నోటిఫికేషన్ మెదలైన మెుదటి రోజే పల‌్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగడంతో వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. శనివారం రాత్రి ఒప్పిచర్లకు చెందిన వైసీపీ నేత చిరుమామిళ్ల శ్రీకాంత్ కొత్త బస్టాండ్ ప్రాంతంలోని ఓ టీస్టాల్ వద్దకు వెళ్లి అక్కడున్న టీడీపీ కార్యకర్తలతో వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో టీడీపీకు చెందిన గోరంట్ల నాగేశ్వరరావు కారుపై శ్రీకాంత్ వర్గం రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఘటనా స్థలానికి వచ్చారు.
అనంతరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న క్రమంలో వైసీపీ నాయకులకు చెందిన కార్లను చూసి టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడికి ఉపక్రమించగా మస్తాన్ అనే కార్యకర్త కారు ధ్వంసమైంది. దీంతో ఇరు వర్గాలు బస్‌స్టాండ్ సమీపంలో మోహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దాచేపల్లి రహదారిలో వైసీపీ కార్యకర్తలు, కొత్త బస్టాండ్ ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు కర్రలతో మోహరించి ఉండగా పోలీసులు ఇరువర్గాల వారికి సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు.