'ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేయాలి' రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు - Election commission
🎬 Watch Now: Feature Video
Central Election Commission Review AP Election Situation : రాజకీయపరంగా ఏపీని అత్యంత సున్నితమైన రాష్ట్రంగా ఈసీ గుర్తించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీశ్ వ్యాస్ తెలిపారు. అయితే మే 13న జరగనున్న ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సులో అధికారులు ఆదేశించారు. సమీక్షకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) ముఖేష్ కుమార్ మీనా, పోలీసు నోడల్ అధికారి శంకబ్రత బాగ్చీ, బెటాలియన్స్ ఏడీజీ, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు.
మే13న జరిగే ఎన్నికల్లో హింసకు, అల్లర్ల జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల రోజు వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డయ్యే దృశ్యాలను భద్రపర్చాలని ఆదేశాలిచ్చారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలని తేల్చి చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, అభ్యర్థులు ఎన్నికల వ్యయం, మద్యం, నగదు అక్రమ రవాణా నియంత్రణ చర్యలపై ఈసీ అధికారులు సమీక్షించారు.