విశాఖ జిల్లాలో భారీగా నగదు పట్టివేత - ఆధారాలు చూపకపోవడంతో ఏంచేశారంటే! - నక్కపల్లి మండాలాల్లో తనిఖీలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 12:34 PM IST
Cash Seized in Visakha: విశాఖ జిల్లాలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. నక్కపల్లి మండల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద, సుమారు 2 కోట్ల 7 లక్షల వరకు నగదును పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని అనకాపల్లి, నక్కపల్లి మండలాల్లో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా కాగిత టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఆదివారం తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో విశాఖ వైపు వెళ్తున్న కారును తనిఖీ చేయగా, అందులో 2 కోట్ల 7 లక్షల 50 వేల రూపాయల నగదు లభ్యమైంది. దీంతో కారు డ్రైవర్‌ను ప్రశ్నించగా, నగదు ఓ ధాన్యం వ్యాపారిదని సమాధానం ఇచ్చాడు. సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో, నగదుతో తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో ముందస్తుగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వివరించారు. గత రెండు వారాల కిందట నక్కపల్లి మండల పరిధిలో చెక్ పోస్టు ఏర్పాటు చేసినట్లు వివరించారు.