పులివెందుల వైఎస్సార్సీపీలో అభద్రతా భావం నెలకొంది : బీటెక్ రవి - పులివెందుల
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 3:14 PM IST
B Tech Ravi Comments on YSRCP: పులివెందుల నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అభద్రతా భావం ఏర్పడిందని టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు. ఈక్రమంలోనే ఆ పార్టీ డబ్బుల సంచులు పంచుతోందని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలోని నాయకులకు డబ్బులు ఇచ్చే స్థాయికి వైఎస్సార్సీపీ దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో వైఎస్సార్సీపీ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టే వారు ఈ చర్యకు పూనుకున్నారని అన్నారు.
చురుకుగా పనిచేస్తున్నందుకు నగదు అందించారని కొందరు వైఎస్సార్సీపీ నాయకులు తనకు ఫోన్ చేసి వివరించినట్లు బీటెక్ రవి తెలిపారు. కార్యకర్తలకు ప్రజల్లో ఉండే ప్రభావాన్ని బట్టి ఒక్కో కార్యకర్తకు 50 వేల నుంచి 15లక్షల వరకు నగదు అందిస్తున్నారని రవి ఆరోపించారు. గతంలో వైఎస్ షర్మిలపై వైఎస్సార్సీపీ నాయకులు విమర్శలు చేసేవారు కాదని, ఆమె ప్రస్తుతం కాంగ్రెస్లోకి మారడంతో అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తున్నారని అన్నారు.
సీఎం జగన్ ఎంతటి నీచనికైనా దిగజారుతారు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం ఎంతటి నీచనికైనా దిగజారుతారని బీటెక్ రవి విమర్శించారు. వైఎస్ షర్మిల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విజయమ్మ జగన్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.