ఆఖరి క్షణంలో అనుమతి రద్దు- సీపీఎస్ ఉద్యోగుల 'ఛలో విజయవాడ' వాయిదా
🎬 Watch Now: Feature Video
APCPS Employees: ప్రభుత్వ ఆంక్షల కారణంగా నేడు నిర్వహించ తలపెట్టిన ఛలో విజయవాడ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్ ప్రకటించారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీపీఎస్ రద్దుపై పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.
ధర్నాచౌక్‌లో సమావేశానికి గతంలోనే దరఖాస్తు చేయగా పోలీసులు మౌఖికంగా అంగీకరించారు. తీరా చివరి క్షణంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నుంచి అనుమతి నిరాకరిస్తూ ప్రకటన రావడంతో ఉద్యోగులు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి నోటీసులు, అరెస్టులతో ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారని ఉద్యోగులు మండిపడ్డారు. మండలం దాటకూడదని ఆంక్షలు విధించారని పనిచేసే కార్యాలయం, ఇల్లు, పాఠశాలలపై నిఘా పెట్టారని ఆరోపించారు. సమావేశాలు, నిరసనలకు అనుమతి ఇవ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్బంధాలు విధిస్తోందని ఉద్యోగులను సంఘ విద్రోహ శక్తుల్లా చూస్తోందని సంఘాల నేతలు ఆరోపించారు.