YSRCP Leaders Fraud In The Name of Jobs in Vijayawada : విజయవాడ కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వైఎస్సార్సీపీ నేత లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారంటూ నిరుద్యోగ మహిళలు భవానీపురం పోలీసులను ఆశ్రయించారు. వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ నేత ఏసు, భవానీపురానికి చెందిన కిషోర్ కలిసి నిరుద్యోగ మహిళలకు కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు.
పెద్ద పెద్ద లాయర్లు పరిచయం ఉన్నారంటూ ఒక్కొక్కరి నుంచి పది లక్షలకు పైగా వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించడంలో జాప్యం జరుగుతుండటంతో అనుమానం వచ్చిన మహిళలు సదరు వ్యక్తులను నిలదీయగా వారు బెదిరింపులకు గురి చేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధిత మహిళలు టీడీపీ నాయకులతో కలిసి భవానీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
'ఎన్నికల ముందు మేము ఉద్యోగం గురించి పదే పదే అడిగి ఒత్తిడికి గురి చేశాం. దీంతో మాకు కోర్టు నుంచి అపాయింట్మెంట్ వచ్చినట్లు దొంగ కాగితాలు సృష్టించి కొన్నాళ్లు కాలం గడపారు. గట్టిగా అడిగితే నాపై ఇప్పటికే రెండు మర్డర్ కేసులు ఉన్నాయి. మిమ్మల్ని చంపేస్తే మరొకటి అవుతుందని లాయర్ బెదించారు.' - బాధితురాలు
తాము అప్పు చేసి ఆ డబ్బులు ఇచ్చామని, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియట్లేదని బాధితులు వాపోతున్నారు.ఇటీవల ప్రభుత్వం మారిపోవడంతో తాము ఏమి చేయలేము అని వారు చేతులెత్తేశారు. మహిళలకు ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇస్తామంటూ మాయ మాటలు చెబుతున్నారు. దీంతో భవానీపురం ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులను కలిసిన బాధిత మహిళలు మోసం చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విజయవాడలో మరో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లు
బాధితుల్లో ఒక మహిళ తన భర్త చనిపోవడంతో పిల్లలను చదివించడానికి చాలా కష్టాలు పడుతున్నానని, ఉద్యోగం వస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని అనుకున్నానని కంటతడి పెట్టుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని స్థానిక టీడీపీ నేతలు భరోసా ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.