YSRCP Leader Family Irregularities : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, జాతీయ రహదారికి ఆనుకుని ఉండే నియోజకవర్గానికి ఆయనే ప్రజాప్రతినిధి. ఆయన అధికారాన్ని కుటుంబమంతా వాడుకుంటుంది. ఎమ్మెల్యే, భూ దందాలు చూసుకుంటే ఆయన సోదరుడు రౌడీయిజం చేస్తారు. ఆ నాయకుడి తల్లి రాజకీయ అంశాల్లో వేలు పెడతారు. ఆ ప్రజాప్రతినిధి నియోజకవర్గ కేంద్రంలో, తన అనుచరులనే బినామీలుగా పెట్టుకుని స్థిరాస్తి దందాలు చేస్తున్నారు. వివాదాస్పద భూములు, దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిల్లో వీరు పాగా వేస్తారు. కొత్త ఇబ్బందులు సృష్టిస్తారు. చివరికి సెటిల్‌మెంట్ పేరుతో, నామమాత్రపు ధరలకు వాటిని లాగేసుకుంటారు. ఆ తర్వాత వాటిల్లో లేఅవుట్లు వేసి విక్రయిస్తారు.
ఈ క్రమంలో ఎవరు ఎదురు తిరిగినా వాళ్ల భరతం పట్టే పనిని ఓ చోటా నాయకుడికి అప్పగించారు. నియోజకవర్గంలో ఎవరైనా కొత్తగా వెంచర్ వేయాలంటే, దాని విలువలో 15 శాతం ముట్టజెప్పాలి. లేదంటే ఆ మేరకు విలువైన భూమిని ‘‘రాజా’’వారికి కప్పం కట్టాల్సిందే. లేకపోతే లేఔట్‌కు అనుమతి రాదు, వ్యాపారం ముందుకు సాగదు. రాజావారికి కప్పం కట్టలేక, కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఏడాదిన్నరగా లేఔట్‌లలో లావాదేవీలు ఆపేసే పరిస్థితికి వెళ్లింది. రియల్ ఎస్టేట్ దందాల ద్వారా గత అయిదేళ్లలో దాదాపు 100 కోట్ల రూపాయలపైనే వెనకేసుకున్నారు.
పైకి నీతిమంతుడిలా మాటలు - మూడోకంటికి తెలియకుండా అక్రమ దందాలు - YSRCP Leader Irregularities
జగనన్న కాలనీల కోసం చేపట్టిన భూ సేకరణలో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులూ కోట్లు పోగేసుకున్నారు. నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాల్లో అతి తక్కువ ధర ఉన్న భూముల్ని ప్రభుత్వ యంత్రాంగంతో అధిక ధరకు కొనిపించారు. కోరుకొండ మండలం బూరుగుపూడిలో, ఒకే చోట 600 ఎకరాలను ఎకరా 45 లక్షల చొప్పున, ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. నిజానికి అక్కడ ఎకరా ధర 15 లక్షలే. భూ యజమానుల నుంచి ఒక్క ఎకరాకు 20 లక్షల చొప్పున తన వాటా వసూలు చేసుకున్నారు. పోనీ, అవైనా మంచిస్థలాలా అంటే అదీలేదు. ఆవ భూములు కావడంతో, అక్కడ నివాసాలు లేవు. ప్రజాప్రతినిధి అనుచరులే 150 ఎకరాల్లో అక్రమంగా, పంటలు సాగు చేస్తున్నారు. కొందరైతే కౌలుకూ ఇచ్చారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ మండలంలో విలువైన భూముల్లో ప్రభుత్వం కొందరికి పట్టాలిచ్చింది. వాటిల్లో 150 పట్టాలు తన బినామీలకే దక్కేలా చక్రం తిప్పారు. ఈ అక్రమాలపై ఎవరు ప్రశ్నించినా వారిపైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.
ఇక నియోజకవర్గంలో ఇసుక నుంచి కోట్లపిండుకున్నాడీ ప్రజాప్రతినిధి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువగా ఇసుక ర్యాంపులుండేది ఆయన నియోజకవర్గంలోనే. వరదల సమయంలో మినహా, ఏడాది పొడవునా భారీ యంత్రాలతో ఇసుక తోడుతూనే ఉంటారు. ఒకే ట్రక్‌షీట్‌తో రోజంతా వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. సీతానగరం మండలం ముగ్గళ్ల, మునికూడలి, వెదుళ్లపల్లి తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తూ వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సొమ్మంతా, రోజూ సాయంత్రం ఈ నాయకుడి తల్లికి చేరుతుంది. ఇక, కేశవరం, కోటి, మునగాల, కాటవరం, కూనవరం, నాగంపల్లి, రాజానగరంలోని పలు కొండలను కొల్లగొట్టారు. ఐదేళ్ల క్రితం భౌతికంగా కనిపించిన అనేక కొండలు ఈ నాయకుడి అక్రమాలకు దస్త్రాల్లోనే కనిపిస్తున్నాయి. కొండల్ని పిండిచేయడంపై, ఓ న్యాయవాది ఫిర్యాదుతో ఎన్జీటీ సుమారు మూడున్నర కోట్ల జరిమానా వేసింది. కోరుకొండ మండలం రాఘవపురం, గాడాల, మధురపూడి, జంబూపట్నం, మునగాల తదితర ప్రాంతాల్లో చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేసి కోట్లు సంపాదించుకున్నారు.
నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ ఆ ప్రజాప్రతినిధి బంధుగణం కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. వారు చెప్పిన పని చేయని అధికారులపైనా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. జలవనరుల శాఖలో ఓ ఇంజినీరు, మరో శాఖకు చెందిన మరో ఇంజినీరుపైన దాడి చేశారు. అధికార బలంతో దాన్ని సద్దుమణిగించారు. వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇసుక మాఫియా లారీలను అడ్డుకున్నందుకు, ఓ దళిత యువకుడని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి శిరోముండనం చేయించారు. ఈ ఘటన జరిగి మూడేళ్లవుతున్నా, నిందితులపై ఈగవాలనీయకుండా చేసుకున్నారు ఆ నాయకుడు. పెదకొండేపూడిలో ఓ ముస్లిం వివాహితకు, ఆమె భర్తతోనే శిరోముండనం చేయించేలా వైసీపీ నాయకులు కుట్రపన్నారు . ఈ నాయకుడి తల్లి అండదండలతోనే వారు అంతకు తెగించారని బాధితురాలు అప్పట్లో ఆరోపించారు.
ఇక నియోజకవర్గంలో జరిగే సెటిల్‌మెంట్లు, దందాలకు ప్రజాప్రతినిధి తమ్ముడే గ్యాంగ్ లీడర్! తనకు గిట్టని వ్యక్తిపై తమ పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలోనే దాడి చేశారు. వారి నియోజకవర్గమే కాకుండా, రాజమహేంద్రవరంలోనూ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను ప్రొత్సహిస్తూ వారికి రక్షణగా ఉంటారు. వారిని అడ్డం పెట్టుకుని సెటిల్‌మెంట్లు చేసి వాటాలు తీసుకుంటారు! తమ అనుచరులపై కేసు పెట్టినా, ప్రత్యర్థి వర్గానికి అనుకూలంగా వ్యవహరించినా, ఈ నాయకుడి సోదరుడు పోలీసులకే హెచ్చరికలు జారీ చేస్తారు.