YSRCP Govt on Amaravati Land Acquisition: రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన అమరావతి గుర్తులు ఏమాత్రం మిగలకుండా చెరిపివేసేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. రాజధానిని కొద్దికొద్దిగా విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా సీఆర్డీఏ అధికారులు రేయింబళ్లు పనిచేస్తున్నారు.
అమరావతి బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జారీచేసిన భూసేకరణ నోటీసులను ఉపసంహరించడం, బృహత్ ప్రణాళిక నుంచి మంగళగిరి మండలంలోని గ్రామాలను తొలగించే ప్రతిపాదనలను గుట్టుగా రూపొందిస్తున్నారు.
ఇవి రావడమే ఆలస్యం ఆమోదముద్ర వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజధాని బృహత్ ప్రణాళికను సవరించొద్దని హైకోర్టు చెప్పినా మొండిగా ముందుకు వెళ్తోంది. రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం హయాంలో 34,281 ఎకరాలను భూసమీకరణలో తీసుకున్నారు. బృహత్ ప్రణాళికకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భూములు ఇవ్వని గ్రామాల్లో సేకరణ ద్వారా తీసుకునేందుకు 4,300 ఎకరాలకు ప్రకటన ఇచ్చారు.
ఘాటెక్కిన గుంటూరు రాజకీయాలు - చంద్రబాబు నిర్ణయం కోసం ఆశావహుల ఎదురుచూపులు
కానీ 191.62 ఎకరాలనే సేకరించారు. ప్రభుత్వం మారిపోవడంతో ఆ ప్రక్రియ అంతటితో నిలిచిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా భూసేకరణ ప్రకటననే వెనక్కి తీసుకునేందుకు సీఆర్డీఏ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండగాల్లోని గ్రామాలతో అమరావతి బృహత్ ప్రణాళిక రూపొందించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని గ్రామాలను తప్పించేందుకు కుట్రలకు పాల్పడింది. తాజాగా నవులూరు, ఎర్రబాలెం, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను ఆ పరిధి నుంచి తప్పించేందుకు అధికారుల ప్రయత్నాలు చివరిదశకు వచ్చాయి. మంగళగిరిలో తెలుగుదేశం నేత లోకేశ్ పోటీ చేస్తున్నారు. ఈ గ్రామాలకు భూసేకరణ ప్రకటన నుంచి విముక్తి కల్పించి తద్వారా రాజకీయంగా లాభపడాలని వైసీపీ భావిస్తోంది.
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని: రాజ్ నాథ్సింగ్
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తెలుగుదేశం ప్రభుత్వం బృహత్ ప్రణాళిక రూపొందించింది. నివాస, ఉపాధి, విద్య, వైద్య అవసరాలకు తగ్గట్లు తయారుచేసింది. రాజధాని 29 గ్రామాల్లో గతంలో ఇచ్చిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించుకుంటే ఈ ప్రణాళికలకు భంగం కలుగుతుంది. ఇప్పటివరకు సేకరణలో ఉన్న భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఉంది.
సేకరణ నుంచి వెనక్కి వెళ్తే ఆ నిషేధం తొలగిపోతుంది. రోడ్లకే భూమిని ఉంచుకుంటారు. మిగిలింది రైతుల స్వాధీనంలోకి వెళ్తుంది. దీనివల్ల మాస్టర్ ప్లాన్ మొత్తం దెబ్బతింటుంది. ఇది అమరావతి అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రభుత్వ కుట్రలకు అధికారులు వత్తాసుపలుకుతున్నారు. గత ప్రభుత్వహయాంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణలో నిర్వాసితులకు రాజధానిలో ప్లాట్లు ఇచ్చారు. ఇంకా కొందరికి నివాస, వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలి.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రక్రియ నిలిచిపోయింది. రాజధాని ప్రాంతంలోని పెద్ద ప్లాట్లను ఎంచుకుని, వాటిని చీల్చి వేలానికి ఉంచుతున్నారు. దీనివల్ల బృహత్ ప్రణాళికకు భంగం వాటిల్లుతుందని తెలిసినా విస్మరిస్తున్నారు. భూముల వేలం ద్వారా వచ్చిన రాబడిని రాజధానిలో వసతుల కల్పన కోసం కాకుండా గుత్తేదారులకు బిల్లులు చెల్లించేందుకు వినియోగిస్తున్నట్లు సమాచారం.
నిన్న ఫుల్ - నేడు నిల్ - కుప్పానికి హంద్రీనీవా జలాల 'సినిమా సెట్టింగ్'