Police Security in Vishaka Sri Sarada Peetham : కంచి, శృంగేరి పీఠాధిపతులు ఎప్పుడైనా రాష్ట్రానికి వస్తే అతిథిగా భావించి భద్రత కల్పిస్తారు. కానీ జగన్ మెచ్చిన గురువుగా పేరున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఎక్కడికి వెళ్లినా ఎస్కార్ట్ వాహనాలు, వై-కేటగిరీలో చుట్టూ భద్రతా సిబ్బంది ఉండేలా ఎక్కడలేని ప్రాధాన్యమిచ్చారు. దానికి కారణం 2019లో జగన్ సీఎం కావాలని ఆయన రాజశ్యామల యాగం చేయడమే! దానికి గురుదక్షిణగా ప్రజాధనంతో శారదా పీఠానికి భద్రత కల్పించారు జగన్ మోహన్ రెడ్డి!
దేవాదాయశాఖలో చక్రం తిప్పిన స్వరూపానంద్రేంద్ర : వైఎస్సార్సీపీ జమానాలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దేవాదాయశాఖలో చక్రం తిప్పారనే ఆరోపణలు లేకపోలేదు. ఆ శాఖ ఉన్నతాధికారులు నిత్యం పీఠం ముందు వరస కట్టేవారు. భీమిలిలో రూ.200 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి కారు చౌకగా కట్టబెట్టడం వాటికి ఊతమిచ్చాయి. ఐతే జగన్ ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో, శారదా పీఠాధిపతి స్వరం మారింది.
Jagn on Sarada Peetham : చంద్రబాబును స్వరూపానందేంద్ర సరస్వతి ఇటీవల పొగడ్తలతో ముంచెత్తారు. దాని వెనుక పెద్ద కారణమే ఉందన్నది పరిశీలకుల మాట. రాష్ట్రంలో ఏ మఠాలు, మఠాధిపతులకూ లేని విధంగా, వైఎస్సార్సీపీ సర్కార్ విశాఖ శారదా పీఠానికి భద్రత కల్పించింది. స్వరూపానందేంద్రకు వై-కేటగిరీలో 2+2 భద్రత కేటాయించారు. ఆశ్రమానికి ఉన్న రెండుగేట్ల వద్ద ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లను విధుల్లో ఉంచారు. ఎస్కార్ట్ వాహనంలో ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ ఉంటారు.
పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతికి సైతం 2+2 భద్రతా సిబ్బంది, మరో ఎస్కార్ట్ వాహనం కేటాయించారు. ఎస్కార్ట్ వాహనాలకు ఇంధన ఖర్చునూ పోలీసు శాఖే భరించాలి. మొత్తంగా శారదా పీఠం వద్ద 20 నుంచి 25 మంది వరకూ భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులకు భద్రత కల్పిస్తే వారికయ్యే జీతభత్యాల ఖర్చును ఆ వ్యక్తులే భరించాలి. కానీ ప్రభుత్వమే భద్రత కల్పించడంతో నెలకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ప్రజాధనం ఖర్చవుతోంది.
రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం : వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లు ఇలా రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల ప్రజాధనం వెచ్చించారు. ప్రస్తుతం భద్రత తొలగించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కాగా, అలాంటిది ఏమీ లేదని ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. ఈ నెల 21న చాతుర్మాస దీక్షకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర రుషికేశ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈలోగా ప్రస్తుత ప్రభుత్వం భద్రతపై ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
విశాఖ శారదా పీఠంలో వైభవోపేతంగా శ్రీ రాజశ్యామల యాగం - సీఎం జగన్ ప్రత్యేక పూజలు