YSRCP Government Negligence on Tribals : అట్టడుగువర్గాల అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం పనిచేయాలి. కానీ సీఎం జగన్ చేస్తున్నదేంటీ? గిరిజన రైతుల కష్టాల్ని ఆయన పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే గిరిపుత్రులు మద్దతు పలుకుతూ వస్తున్నా వారి ఆవేదన జగన్‌కు పట్టడం లేదు. అడవి బిడ్డలకు ఆర్థికంగా అండగా ఉండే గిరిజన సహకార సంస్థను జగన్ సర్కార్ కార్పొరేట్ సంస్థగా మార్చేసింది. గిరిజనులు సేకరించే కిలో కొండ తేనెకు వ్యాపారులు 500 చెల్లిస్తుంటే జీసీసీ మాత్రం 200రూపాయలే ఇస్తోంది. పిక్క తీసిన కిలో చింతపండును ప్రైవేటు వ్యాపారులు 40 నుంచి 50కు కొనుగోలు చేస్తుంటే 32 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఈ రెండే కాదు కరక్కాయలు, నరమామిడి చెక్కలు, నల్లజీడి పిక్కలు, రజ్‌మా, రాగులు, కాఫీ, మిరియాలు, పసుపు.. ఇలా ప్రతి అటవీ ఉత్పత్తి కొనుగోలులో ఇదే పరిస్థితి. గిరిజనులు సేకరించే, పండించే ఉత్పత్తులను జీసీసీకి విక్రయించేలా సంతల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి.
Tribals Purchase of Products in Andhra Pradesh : గిరిజనుల నుంచి తక్కువ ధరకు తేనె, కాఫీ వంటి ఉత్పత్తుల్ని కొనుగోలుచేస్తున్న జీసీపీ ప్రాసెసింగ్ చేసి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చుతోంది. అనంతరం వాటిని రిటైల్‌గా దుకాణాల్లో, మాల్స్‌ల్లో అధిక ధరలకు విక్రయిస్తోంది. కిలో 200 చొప్పున చెల్లించి సేకరించిన అడవి తేనెను శుద్ధి చేసి 'గిరిజన్ హనీ' పేరిట 400 రూపాయల చొప్పున అమ్ముతోంది. అన్ని ఉత్పత్తుల విక్రయాలదీ ఇదే తీరు. గిరిజనులు పండించే సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ ఎక్కువ. కొన్నింటికైతే ప్రాసెసింగ్ కూడా పెద్దగా అవసరం ఉండదు. ఈ పరిస్థితుల్లో అడవి బిడ్డలను మరింత ప్రోత్సహిస్తూ ఆర్థికంగా దన్నుగా నిలవాల్సిన జగన్ లాభాల లెక్కలేసుకుంటూ వారి వెన్నువిరుస్తున్నారు.
గూడు లేకా గోసపడుతున్న గిరిజనులు - అండగా ఉంటానని పట్టించుకోని సీఎం జగన్
కాఫీ పండించే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. మధుర రుచితో కాఫీ ప్రియుల మనసు దోచే అరకు కాఫీని తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్‌గా మార్చింది. కానీ వైఎస్సార్సీపీ సర్కార్ అసమర్థతతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ కాఫీ గింజలు పండించే రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. పాడేరు, అరకు వ్యాలీ, చింతపల్లి, జీకే వీధి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు తదితర ప్రాంతాల్లో దాదాపు లక్ష ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. ఈ ఏడాది దిగుబడితో పాటు నాణ్యత తగ్గినట్లు అంచనాలున్నాయి. ఈ పరిస్థితుల్లో కాఫీ పంటకు 280 మద్దతుధర ప్రకటించి గొప్పలకు పోయిన జగన్ సర్కార్ సేకరణను గాలికొదిలేసింది. ఈ ఏడాది 1000 టన్నుల కాఫీ గింజలను సేకరించాలనే లక్ష్యమున్నా ఇప్పటివరకు తీసుకుంది. 240 టన్నులే. సీజన్ ముగిసేలోగా 600 టన్నులకు మించే అవకాశం కనిపించడం లేదు.
సేకరించిన పంటలోనూ పార్చ్‌మెంట్ రకానికి 10శాతం తేమ, చెర్రీ రకానికి 10.5శాతానికి మించకూడదని కొర్రీలు పెడుతోంది జీసీసీ వాటిలో ఏమాత్రం తేడా ఉన్నా ప్రైవేటు వ్యాపారుల మాదిరిగానే బేరసారలాడుతోంది. కిలో పార్చ్‌మెంటు కాఫీకి 280, చెర్రీ కాఫీకి 145 రూపాయల చొప్పున గిరిపుత్రులకు చెల్లిస్తూ అదే పార్చ్‌మెంటు కాఫీ పొడిని 200 గ్రాములు 90రూపాయల చొప్పున విడిగా విక్రయిస్తోంది. అంటే కిలోకు 450 చొప్పున ఆదాయం పొందుతోంది. ఈ లెక్కన చూస్తే కిలోకు 170 ఆదాయాన్ని పొందుతున్నట్టే. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారుల్ని ఆశ్రయిస్తున్న కాపీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 70 నుంచి 80 కిలోల కాఫీ గింజల బస్తాపై తరుగు కింద 2 నుంచి 3 కిలోలు తీసేస్తున్నారు. కిలో 220 వేసుకున్నా బస్తాపై 660 వరకు నష్టపోయినట్టే. 10 బస్తాలు పండించే రైతుకు సగటున 30 కిలోలు తరుగు కిందనే తీసేస్తున్నారు. అంటే 6వేల 600 రూపాయల నష్టపోతున్నారు.
గిరి పుత్రుల ప్రాణాలతో జగన్ చెలగాటం - ద్విచక్ర వాహన ఫీడర్ అంబులెన్స్‌లపై తీవ్ర నిర్లక్ష్యం
పంటల సాగు కోసం జీసీసీ ద్వారా ఇచ్చే రుణాలకూ జగన్ సర్కార్ నెమ్మదిగా మంగళం పాడుతోంది. 2023ఏడాదికి 160 మందికే కాఫీ పంట సాగుకు ముందస్తుగా రుణమిచ్చారు. ఎకరానికి 5 వేల నుంచి 20 వేల వరకు మొత్తం 22 లక్షలే ఇచ్చి చేతులు దులుపుకుంది. అంతకుముందు ఏడాది 560 మందికి ఇచ్చి ఒక్క ఏడాదిలోనే 400 మందిని తెగ్గోశారు. రుణాలు దొరకని పరిస్థితుల్లో సాగుకు ముందే గ్రామాల్లో వాలిపోతున్న ప్రైవేటు వ్యాపారులు దిగుబడిని తమకే విక్రయించాలని ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. కొందరైతే పంటను పూర్తిగా అప్పు కింద మినహాయించుకుంటున్నారు.
అప్పులకు వడ్డీలు కట్టలేక ఎంతోమంది రైతులు కుదేలవుతున్నారు. జీసీసీ ఆధ్వర్యంలో అరకులో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరాటంకంగా నడిచిన సబ్బుల తయారీ పరిశ్రమ ఏడాదిన్నర క్రితం మూతపడింది. గిరిజన వసతి గృహాల్లోని విద్యార్థులకు కాస్మొటిక్స్ కింద ఇచ్చే సబ్బులు ఇక్కడి నుంచే సరఫరా అవుతుండేవి. గిరిజనులకు ఉపాధి కల్పించే ఈ పరిశ్రమను తిరిగి తెరిపించాలనే ఆలోచన కూడా జగన్ ప్రభుత్వం చేయలేదు.
ప్రభుత్వ అనాలోచిత విధానంతో విజయనగరంలోని మరో సబ్బుల తయారీ పరిశ్రమ కూడా మూతపడే పరిస్థితి ఏర్పడింది. జీసీసీలో దాదాపుగా 600 పోస్టులు ఖాళీలు పనితీరుపై ప్రభావం పడుతోంది. కొత్తగా పోస్టులను భర్తీ చేయని జగన్ పొరుగు సేవల కింద టీడీపీ ప్రభుత్వం నియమించిన వారిని తొలగించారు. జీసీసీ ప్రధాన కార్యాలయ భవనాన్ని ఆధునికీకరించి వాణిజ్య సముదాయంగా నిర్మించాలని తెదేపా హయాంలో చేసిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేశారు.