YSRCP Government Neglected Sports Ground in Mylavaram: క్రీడల పట్ల గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరితో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విశాలవంతమైన క్రీడా మైదానం మరుగునపడింది. ఎన్నికలకు ముందు అభివృద్ధి పేరిట ట్రాక్‌లను తొలగించి మట్టి గుట్టలతో మరింత దయనీయంగా మార్చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్లో స్ఫూర్తి నింపాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మైలవరంలో దశాబ్దాల కిందట దాతల సహకారంతో ఏడెకరాల స్థలంలో క్రీడామైదానం నిర్మించి అన్ని వసతులు కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రస్థాయిలో క్రీడాపోటీలు నిర్వహించటంతో ఔత్సాహిక క్రీడాకారుల్లో ఆసక్తి పెరిగింది. క్రీడా పాఠశాల ఏర్పాటు చేస్తే మరింత ప్రోత్సాహం అందించినట్టవుతుందని భావించిన టీడీపీ ప్రభుత్వం 2019లో బాలికల క్రీడా పాఠశాలను ప్రారంభించింది. ఎన్నికల తర్వాత శాప్ ఆధ్వర్యంలో బాలికల క్రీడా పాఠశాల ఏర్పాటు చేసి, టెన్విక్ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.
సుశిక్షితులైన కోచ్‌లతో తైక్వాండో, కబడ్డీ, ఫెన్సింగ్, వాలీబాల్ విభాగాల్లో బాలికలకు శిక్షణ ఇచ్చారు. సమీప పాఠశాల, కళాశాలల్లో వారికి ప్రవేశాలు కల్పించి, స్టేడియంలోనే వసతి ఏర్పాట్లు చేశారు. ఏడాదిలోనే ఆయా పోటీల్లో పలువురు క్రీడాకారిణులు పతకాలు సాధించి, పాఠశాలకు గుర్తింపు తెచ్చారు. కానీ 2020లో కరోనా వంకతో పాఠశాలకు తాత్కాలిక సెలవుల పేరిట విద్యార్థినులను ఇళ్లకు పంపారు. నాటి నుంచి నేటి వరకు మళ్లీ క్రీడామైదానం ప్రారంభానికి నోచుకోలేదు.
వైసీపీ ప్రభుత్వంలో సాధారణ ఎన్నికలకు ముందు మైదానం అభివృద్ధి పనుల పేరిట ట్రాకులను, స్టేడియాన్ని తవ్వి చదును చేశారు. కొత్తగా మట్టితో పరచాలని గుట్టలతో నింపారు. ఈ లోగా ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను అక్కడి ఇండోర్ స్టేడియంలోనే భద్రపరచాలంటూ అధికారులు పనులు నిలిపివేశారు. ఎన్నికలు ముగిసి నెలలు గడిచినా మట్టి గుట్టలు అలాగే ఉండిపోయాయి. కనీసం ట్రాకును పునరుద్ధరించకపోవడంతో నడవటానికి ఇబ్బందిగా ఉందని క్రీడాకారులు వాపోతున్నారు. ప్రస్తుతం మైదానంలో గడ్డి, పిచ్చి మెుక్కలు పెరిగిపోయాయి. లక్షల రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియం, బయట గ్యాలరీలు నిరుపయోగంగా తయారయ్యాయి. క్రీడా మైదానాన్ని అధికారులు మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.