Amaravati Smart City funds: కూట్లో రాయితీయలేనోడు, ఏట్లో రాయి తీసేందుకు వెళ్లాడట'.! అచ్చం ఇలాగే ఉంది మన సీఎంగా జగన్ ఐదేళ్ల పాలనా ఘనకార్యం.! కళ్లముందున్న అమరావతి అభివృద్ధిని కాలరాసి, మూడు రాజధానులు అంటూ కాలం వెళ్లదీశారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడి చొరవతో, దేశంలోని వంద నగరాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి ప్రజలకు నాణ్యమైన, సౌకర్యవంతమైన జీవనం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ‘స్మార్ట్ సిటీస్ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. అప్పుడే పురుడు పోసుకుని కొత్త నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతికి కూడా కేంద్రం ఈ మిషన్‌లో చోటుకల్పించింది. అందుకు అప్పటి సీఎం చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చాలా కృషి చేశారు. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లడం, ఆమోదముద్ర పడటం చకచకా సాగిపోయాయి. మొత్తానికి 2017 జూన్‌లో అమరావతికి, ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కింది.
ఒక్కో నగరానికి వెయ్యి కోట్ల చొప్పున : స్మార్ట్ సిటీ కింద ఎంపికైన ఒక్కో నగరానికి వెయ్యి కోట్ల చొప్పున నిధులు అందుతాయి. అందులో 500 కోట్లు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్, 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్. ఈ నిధులతో ప్రాజెక్టులు రూపొందించుకుని నిర్వహించుకునే సౌలభ్యాన్ని రాష్ట్రాలకు కల్పించింది కేంద్రం. అదనంగా పీపీపీ పద్ధతిలో కానీ, రుణాలు, ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరించుకుని ప్రాజెక్టును విస్తరించుకునే వెసులుబాటును కూడా ఇచ్చింది. మిషన్ కింద ఇచ్చే నిధులతో పాటు అదనంగా ఇతర వనరుల ద్వారా 2వేల 46 కోట్లు సేకరించి, ఆ నిధులతో చేపట్టాల్సిన 20 పనులకు కూడా అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాజధాని నిర్మాణం, స్మార్ట్ సిటీ పనుల మధ్య సమన్వయానికి సీఆర్డీఏ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మధ్య అవగాహన కుదిరింది. పనుల బాధ్యతను సీఆర్డీఏకు అప్పగించారు. పనులకు వెచ్చించిన మొత్తాన్ని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సీఆర్డీఏకు బదిలీ చేస్తుంది. పనుల కోసం కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన 500 కోట్ల గ్రాంట్‌లో 488 కోట్లను అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన మ్యాచింగ్ గ్రాంట్ వాటాగా 488 కోట్లు కేటాయించింది. ఇలా మొత్తం 976 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి.
నిధులను దారి మళ్లించి: పనులు పరుగులు తీస్తున్న తరుణంలోనే జగన్ సర్కారు అధికారంలోకి రావడంతో.. అమరావతి స్మార్ట్ సిటీకి గ్రహణం పట్టింది. అప్పటికే విడుదలైన 976 కోట్లలో 936 కోట్లను గ్రీన్ ఛానల్ పీడీ ఖాతాలో జమ చేశారు. ఖజానా శాఖ ఆంక్షలు లేకుండా గ్రీన్ ఛానల్ పీడీ ఖాతా నుంచి నేరుగా బిల్లులు మంజూరవుతుంటాయి. దీంతో ఈ ఖాతాలోని కోట్ల నిధులు జగన్ ప్రభుత్వ అజమాయిషీలోకి వెళ్లాయి. ఫలితంగా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించింది. తమ నిధులను తమకు అందుబాటులో ఉంచాలని సీఆర్డీఏ, ఏఎస్ఎస్సీసీఎల్ కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా జగన్ సర్కారు అస్సలు స్పందించలేదు. చివరికి అమరావతి స్మార్ట్ సిటీ పనులు ఆగిపోయాయి.
Smart Cities Works in AP: ఏ అభివృద్ధైనా సరే.. మాట ఇచ్చాడా..మడమ తిప్పినట్లే..!
అర్ధాంతరంగా రద్దు చేసి: చంద్రబాబు హయాంలో అమరావతి స్మార్ట్ సిటీ కోసం 2వేల 46 కోట్లతో రూపొందించిన 20 పనుల్లో పదింటిని అర్ధాంతరంగా రద్దు చేశారు. మిగిలిన 10 పనుల పరిధిని కూడా వైకాపా ప్రభుత్వం భారీగా కుదించింది. ఆ పనులను కూడా పూర్తిచేయలేకపోయారు జగన్. రాజధానికే తలమానికంగా నిలిచేలా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రాంతంలో గత టీడీపీ ప్రభుత్వం 350 కోట్లతో సెంట్రల్ పార్కు నిర్మాణ పనులను చేపట్టింది. ఈ పనులను జగన్ ఆపేశారు. రాజధానిలో దాదాపు 700 కిలోమీటర్ల నిడివితో భూగర్భంలో విద్యుత్, అంతర్జాల, తదితర అవసరాల కోసం గత ప్రభుత్వం డక్ట్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 270 కోట్లతో చేపట్టిన ఈ పనులను కూడా రద్దు చేశారు. ఈ రెండు పనులపై ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా వెచ్చించారు. పనులు రద్దుతో ఆ మొత్తం నిధులను గంగలో పోసినట్లయింది.
అప్పుడు రాజధాని.. ఇప్పుడు స్మార్ట్‌సిటీ.. అమరావతిపై ప్రభుత్వానికి ఎందుకంత అక్కసు?
కేంద్రం నిబంధనలు మార్చినా: జగన్ సర్కారు తీరును గ్రహించిన కేంద్రం, చివరకు నిబంధనలనే మార్చేసింది. కేంద్రం పర్యవేక్షణలోని సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతా తెరిచి.. వినియోగించని నిధులను ఆ ఖాతాలోకి బదిలీ చేయాలని ఆదేశించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి సీఆర్డీఏకు 560 కోట్లను బదిలీ చేసే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నింది. గ్రీన్ ఛానల్ పీడీ ఖాతాలోని నిధులను తమకు చెల్లించాలని సీఆర్డీఏ అధికారులు ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పట్టించుకోలేదు. ఆ డబ్బుతో అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీవో, ఎన్జీవోల హౌసింగ్ ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని సీఆర్డీఏ అధికారులు పలుమార్లు రాష్ట్ర ఆర్థిక శాఖకు విన్నవించినా పెడచెవిన పెట్టింది. కేంద్రం ఎస్‌ఎన్‌ఏ ఖాతాపై విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలతో చేసేదేమీ లేక హడావుడిగా మార్చి, 2022లో అమరావతి స్మార్ట్ సిటీ గ్రీన్ ఛానల్ పీడీ ఖాతా నుంచి సీఆర్డీఏ పీడీ ఖాతాకు 560 కోట్లు జమ చేసింది. తర్వాత వెంటనే ఆ మొత్తాన్ని జగన్ సర్కారు వేరే పథకాలకు మళ్లించేందుకు మాయం చేసింది.