YS Jagan Mohan Reddy Fires on Police: అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి హాజరయ్యారు. నల్ల కండువాలు, నల్ల బ్యాడ్జీలు ధరించడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. లోపలికి అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో పోలీసులపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. నేతల చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లను పోలీసులు లాక్కుని చింపేశారంటూ, పోలీసుల పట్ల జగన్ దురుసుగా ప్రవర్తించారు. పోలీసు అధికారిని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
ప్లకార్డులు ప్రదర్శించొద్దని చెప్పడంపై వైఎస్సార్సీపీ సభ్యులు మండిపడ్డారు. పేపర్లు గుంజుకుని చించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్ జగన్‌తో సహా ఎమ్మెల్యేలు శాసనసభలో నిరసన తెలిపారు. మెడలో నల్ల కండువాలు ధరించిన జగన్ సహా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసన సభకు వచ్చారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభంతోనే, సేవ్ డెమొక్రసీ’ అని నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. వారి నిరసన మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కొద్ది సేపు నిరసన తెలిపిన అనంతరం సభలో వాకౌట్ చేసి బయటకు వచ్చిన జగన్ సహా ఎమ్మెల్యేలు తాడేపల్లి వెళ్లిపోయారు.
అసెంబ్లీలో ఆ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ - ఏం మాట్లాడుకున్నారంటే? - ys jagan raghu rama conversation
'ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు గుర్తుపెట్టుకో'- అసెంబ్లీ వద్ద జగన్నాటకం - Jagan Warning to Police