Youth Protest on Cheating in Aadudam Andhra Tournament: 'ఆడుదాం ఆంధ్రా'లో తమకు అన్యాయం జరిగిందంటూ యువత రోడ్డెక్కి ఆందోళనకు దిగింది. ఈ ఘటన పార్వతీపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లే ముందు తమ జట్టు నాట్ క్వాలిఫైడ్ అని అధికారులు తెలిపారంటూ బాధిత యువత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాలూరు నియోజకవర్గం పాచిపెంట క్రికెట్ బృందం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది.
'జగనన్న ఆడుదాం ఆంధ్ర'లో వైఎస్సార్సీపీ నాయకుడు హల్చల్
పార్వతీపురంలో 'ఆడుదాం ఆంధ్రా' క్రీడల్లో భాగంగా ఇటీవల జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు జరిగాయి. అందులో పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలకు చెందిన బృందాలు ఫైనల్లో పోటీపడ్డాయి. సాలూరు టీమ్ విజేతగా నిలిచి రాష్ట్రస్థాయికి అర్హత సాధించినట్లు అధికారులు ప్రకటించినట్లు పాచిపెంట క్రికెట్ జట్టు తెలిపింది. అయితే తమ జట్టులో వేరే క్రీడాకారులు అదనంగా ఆడినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీంతో దర్యాప్తు చేయగా రుజువు కావటంతో తమ జట్టు క్వాలిఫై కాలేదని అధికారులు తెలిపారన్నారు.
పోటీ పెట్టే ముందు రెండు టీమ్‌లను పిలిచి ఎటువంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసుకుని టోర్నమెంట్ నిర్వహించారని, ఇప్పుడేమో వేరే ఆరోపణలు చేస్తూ తమ జట్టు క్వాలిఫై కాలేదనటం దారణమన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల ప్రభావంతో తమ చేతిలో ఓడిపోయిన పార్వతీపురం జట్టును విజేతగా ప్రకటించి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించటం అన్యాయమని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.
'ఆడుదాం ఆంధ్రా' పోటీల్లో ఘర్షణ - కుర్చీలతో దాడి చేసుకున్న ఆటగాళ్లు
తమకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ రోడ్డుపై కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి పాచిపెంట క్రికెట్ బృందం ఆందోళన చేపట్టింది. అయితే అధికారులకు తమ గోడు చెబుదామని తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. విషయం తెలుసుకున్న సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని యువకులకు నచ్చజెప్పి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు.
"ఆడుదాం ఆంధ్రా' టోర్నమెంట్ నిర్వహించే ముందే మా రెండు జట్లను పిలిచి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసుకున్నాకే క్రికెట్ ఆడించారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచి మేము రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లే ముందు అధికారులు మా జట్టును క్వాలిఫై కాలేదని ప్రకటించారు. అయితే ఇప్పుడేమే వేరే ఆరోపణలు చేస్తూ మా చేతిలో ఓడిపోయిన టీమ్‌ను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించటం దారుణం. కొంతమంది రాజకీయ నాయకులు ప్రభావంతోనే అధికారులు మా జట్టును కాకుండా ఓడిపోయిన టీమ్‌ను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తున్నారు. మా గోడు చెబుదామని తిరుగుతుంటే అధికారులేవరూ మమ్మల్ని పట్టించుకోవడంలేదు." - పాచిపెంట క్రికెట్ బృందం
'ఆడుదాం ఆంధ్ర' పోటీల్లో బాహాబాహీ- ఇరుజట్ల మధ్య తీవ్ర వాగ్వాదం